రైల్వేస్టేషన్ పునర్నిర్మాణంపై నీలినీడలు
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:26 AM
ప్రధాని నరేంద్రమోదీ ఎంతో అట్టహాసంగా ప్రకటించిన ‘అమృత్ భారత్’ పథకం విశాఖపట్నంలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి స్వయంగా ఆయనే వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. అందులో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అరకులోయ, కొత్తవలస, విజయనగరం తదితర స్టేషన్లతో పాటు విశాఖపట్నం కూడా ఉంది. ఒక్క విశాఖపట్నం స్టేషన్ పునర్నిర్మాణానికే రూ.456 కోట్లు కేటాయించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనపు ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సమగ్ర ప్రణాళిక రూపొందించారు. అయితే విశాఖ స్టేషన్‌తో పాటు ప్రారంభించిన ఇతర స్టేషన్ల అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కానీ విశాఖపట్నం చూస్తే రెండేళ్ల క్రితం తవ్విన గోతులు వెక్కిరిస్తున్నాయి.
ముందుకుసాగని పనులు
అమృత్ భారత్ కింద రూ.456 కోట్లు మంజూరు
అదనపు ప్లాట్‌ఫారాలు, మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళిక
గోతులు తవ్వి వదిలేసిన వైనం
పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్
మరొకరికి అప్పగించినా పురోగతి లేదు
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
(విశాఖపట్నం-ఆంరఽధజ్యోతి)
ప్రధాని నరేంద్రమోదీ ఎంతో అట్టహాసంగా ప్రకటించిన ‘అమృత్ భారత్’ పథకం విశాఖపట్నంలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి స్వయంగా ఆయనే వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. అందులో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అరకులోయ, కొత్తవలస, విజయనగరం తదితర స్టేషన్లతో పాటు విశాఖపట్నం కూడా ఉంది. ఒక్క విశాఖపట్నం స్టేషన్ పునర్నిర్మాణానికే రూ.456 కోట్లు కేటాయించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనపు ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సమగ్ర ప్రణాళిక రూపొందించారు. అయితే విశాఖ స్టేషన్‌తో పాటు ప్రారంభించిన ఇతర స్టేషన్ల అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కానీ విశాఖపట్నం చూస్తే రెండేళ్ల క్రితం తవ్విన గోతులు వెక్కిరిస్తున్నాయి.
కాంట్రాక్టర్‌తో వివాదం
విశాఖలో ప్రసుత్తం ఎనిమిది ప్లాట్‌ఫారాలు ఉండగా జ్ఞానాపురం వైపు అదనంగా మరో రెండు ప్లాట్‌ఫారాలు నిర్మించాలని ఈ పథకంలో పనులు చేపట్టారు. అటు వైపు ద్వారం మూసేసి, జ్ఞానాపురం వైపు చెట్లు తొలగించి, స్థలం చదును చేసి, పిల్లర్ల నిర్మాణానికి భారీ గోతులు తవ్వారు. ఏమైందో ఏమో కాంట్రాక్టర్ మధ్యలో పనులు ఆపేశారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ ఎక్కడివక్కడ వదిలేశారు. ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది. ఆ కాంట్రాక్టర్‌ను తొలగించారు. కొత్తగా టెండర్లు పిలిచారు. దానిని ఖరారు కూడా చేశారని చెబుతున్నారు. కానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు. దీనిపై స్థానిక నాయకులు పెద్దగా దృష్టిపెట్టడం లేదు. పక్కనే ఉన్న రైల్వేస్టేషన్ల పనులు పూర్తయిపోతున్నా ఏమీ పట్టనట్టుగానే ఉంటున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఆర్‌ఎం ఒక కాంట్రాక్టర్ నుంచి ముంబైలో భారీ లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాంతో రైల్వే అధికారులు కాంట్రాక్టర్ల విషయంలో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. ఓ వైపు రూ.456 కోట్ల భారీ బడ్జెట్. మరో వైపు ఏమైనా ఆశిస్తే సీబీఐకి పట్టించేస్తారేమోననే భయం. ఈ ఊగిసలాట, అనుమానాలతో కాంట్రాక్టర్‌పై పనుల ప్రారంభానికి ఒత్తిడి తేవడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులు విశాఖపట్నంపై ఎప్పటిలాగే సవతి ప్రేమ చూపిస్తూ పనులు ప్రారంభించకపోయినా సంబంధం లేనట్టుగా ఉంటున్నారు.
ఎన్నో ప్రతిపాదనలు
రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తయితే రెండు కొత్త ప్లాట్‌ఫారాలతో పాటు లోపల 32 ఎస్కలేటర్లు, 20 లిఫ్టులు, బయట వాహనాల పార్కింగ్ కోసం మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం వంటివి వస్తాయి. అన్ని తరగతుల ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన వసతులు, పరిశుభ్రతతో కూడిన ఫుడ్ స్టాళ్లు, పేయింగ్ రెస్ట్‌రూమ్‌లు, ఇలా అనేక సౌకర్యాలు రానున్నాయి. వాస్తవానికి 2025 చివరికి ఈ ప్రాజెక్టు పూర్తికావాలి. ఇంకో ఎనిమిది నెలలు మాత్రమే వ్యవధి ఉంది. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించినా పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. విశాఖపట్నం ఎంపీతో పాటు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ కూడా అయిన పక్క జిల్లా ఎంపీ సీఎం రమేశ్ కూడా దృష్టిపెడితే వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.