పాడేరులో ట్రాఫిక్ అస్తవ్యస్తం
ABN , Publish Date - May 14 , 2025 | 11:29 PM
జిల్లా కేంద్రం పాడేరులో ట్రాఫిక్ నిర్వహణ అధ్వానంగా ఉంది. బుధవారం ఉదయం బంగ్లా నుంచి కలెక్టరేట్‌కు వెళుతున్న ఇన్‌చార్జి కలెక్టర్ అభిషేక్‌గౌడ వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో పాడేరులోని ట్రాఫిక్ సమస్య మరో మారు చర్చనీయాంశమైంది.
క్రమబద్ధీకరించడంలో పోలీసులు విఫలం
ఇన్‌చార్జి కలెక్టర్‌కూ తప్పని అవస్థలు
వాహనచోదకులు నిత్యం సతమతం
పాడేరు, మే 14(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరులో ట్రాఫిక్ నిర్వహణ అధ్వానంగా ఉంది. బుధవారం ఉదయం బంగ్లా నుంచి కలెక్టరేట్‌కు వెళుతున్న ఇన్‌చార్జి కలెక్టర్ అభిషేక్‌గౌడ వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో పాడేరులోని ట్రాఫిక్ సమస్య మరో మారు చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రమైన తరువాత పాడేరులో వాహనాల రద్దీ బాగా పెరిగింది. అలాగే మెయిన్‌రోడ్లను ఆక్రమించి చిరు వర్తకులు దుకాణాలను ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పాడేరులో ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళికాబద్ధ్దంగా వ్యవహరించకుండా మొక్కుబడిగా పోలీసులు చర్యలు చేపట్టడంతో ప్రతి సోమ, గురు, శుక్రవారాలు అఽధికంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. అలాగే ప్రతి రోజూ సాయంత్రం వేళల్లో దుకాణాలు, హోటళ్ల ముందు పలువురు ఇష్టానుసారంగా వాహనాలను నిలిపి వేస్తుండడంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఇన్‌చార్జి కలెక్టర్
ట్రాఫిక్ కష్టాలను ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ కూడా ఎదుర్కొన్నారు. బుధవారం ఉదయం పదిన్నర సమయంలో ఆయన కలెక్టరేట్‌కు వెళుతుండగా మెయిన్‌రోడ్డులోని ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో పాటు ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలతో రోడ్డు కిక్కిరిసింది. వాస్తవానికి ఉత్సవాలు మూడు రోజులు జిల్లా కేంద్రంలో ఎటువంటి రాకపోకలు ఉండని నేపథ్యంలో బుధవారం కచ్చితంగా ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో బుధవారం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టాలి. కానీ మచ్చుకైనా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇన్‌చార్జి కలెక్టర్ వాహనం సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. కొంత సేపు ఇన్‌చార్జి కలెక్టర్ వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు పాడేరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.