Share News

పాడేరు ఘాట్‌లో స్తంభించిన ట్రాఫిక్‌

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:40 AM

స్థానిక ఘాట్‌ మార్గంలో బుధవారం ఉదయం ఏసుప్రభు బొమ్మ మలుపులో ఎదురెదురుగా రెండు లారీలుగా ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారుగా మూడు గంటల పాటు ఘాట్‌లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

పాడేరు ఘాట్‌లో స్తంభించిన ట్రాఫిక్‌
పాడేరు ఘాట్‌లో ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన లారీలు

ఓ మలుపు వద్ద రెండు లారీలు ఆగిపోవడమే కారణం

కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌కూ తప్పని ఇబ్బందులు

పాడేరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఘాట్‌ మార్గంలో బుధవారం ఉదయం ఏసుప్రభు బొమ్మ మలుపులో ఎదురెదురుగా రెండు లారీలుగా ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారుగా మూడు గంటల పాటు ఘాట్‌లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మైదాన ప్రాంతం నుంచి సిమెంట్‌ లోడుతో ఏజెన్సీకి వస్తున్న ఓ భారీ లారీ ఘాట్‌లో ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద ఆగిపోయింది. అలాగే పాడేరు వైపు నుంచి ఇనుప పైపులతో మైదాన ప్రాంతానికి వెళుతున్న మరో భారీ లారీ ఆమలుపులో తిరగలేక రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది. దీంతో రెండు భారీ లారీలు మలుపునకు అడ్డంగా ఉండిపోవడంతో వాహనాల రాకపోకలకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బుధవారం ఉదయం పది గంటల నుంచి సుమారుగా మూడు గంటల పాటు ఏజెన్సీకి, మైదాన ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. తరచూ ఘాట్‌లో ఇటువంటి పరిస్థితులు ఎదురువుతుండడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు, పర్యాటకులు.. భారీ వాహనాలు కనిపిస్తే బెంబేలెత్తిపోతున్నారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే ఘాట్‌ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 25 కిలోమీటర్లు ఘాట్‌ మార్గమే. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. ఈ క్రమంలో ఘాట్‌లో ఎటువంటి అంతరాయం ఏర్పడినా మొత్తం రాకపోకలు నిలిచిపోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. ప్రధానంగా రాత్రి వేళల్లో ఇటువంటి ఘటనలు జరిగితే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

కలెక్టర్‌కూ తప్పని అవస్థలు

ఘాట్‌లోని ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద ట్రాఫిక్‌ స్తంభించడంతో విశాఖపట్నం నుంచి పాడేరు వస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో వెంటనే పాడేరు నుంచి మరో వాహనాన్ని ర ప్పించుకుని కలెక్టర్‌ అక్కడి నుంచి గమ్యానికి చేరుకున్నారు. అయితే సుమారుగా మూడు గంటల తరువాత రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీలను పక్కకు తీయడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. మోటారు చట్టాల నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌ లోడ్‌తో ఘాట్‌లో రాకపోకలు సాగించే క్రమంలో ఈ సమస్య ఎదురవుతోంది. దీనిపై రవాణా, పోలీసు అధికారులు కనీసం దృష్టిసారించకపోవడంతో వారంలో కనీసం రెండు, మూడు మార్లు ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదని బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:40 AM