Share News

‘రాసా’ వేషాలు

ABN , Publish Date - Dec 18 , 2025 | 01:28 AM

జీవీఎంసీ పరిధిలోని కొన్ని జోన్‌ల నుంచి చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించే కాంట్రాక్టు సంస్థ ‘రాసా’పై అధికారులు అంతులేని ప్రేమ కనబరుస్తున్నారు. ఆ సంస్థ సక్రమంగా పనులు చేయడం లేదని ఇటీవల గుర్తించిన కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ రూ.58 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు.

‘రాసా’ వేషాలు

బిల్లులు చెల్లించడం లేదంటూ

కాపులుప్పాడ యార్డుకు చెత్త తరలింపు నిలిపివేసిన సంస్థ

గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లలో కొండల్లా పేరుకుపోయిన చెత్త

అయినా చర్యలకు అధికారులు మీనమేషాలు

కొత్తగా పిలిచిన టెండర్లలో తమ బిడ్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని సదరు సంస్థ విజ్ఞప్తి

అయినా ఆ సంస్థకే రెండు సీసీఎస్‌ ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు యత్నం

ఆ సంస్థకు జీవీఎంసీలోని కీలక అధికారుల అండదండలు

అందుకే ఆ సంస్థ నుంచి చేయాల్సిన రూ.58 లక్షలు రికవరీపై ఉదాసీనత

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ పరిధిలోని కొన్ని జోన్‌ల నుంచి చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించే కాంట్రాక్టు సంస్థ ‘రాసా’పై అధికారులు అంతులేని ప్రేమ కనబరుస్తున్నారు. ఆ సంస్థ సక్రమంగా పనులు చేయడం లేదని ఇటీవల గుర్తించిన కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ రూ.58 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు. ఇంతవరకూ రికవరీ ప్రస్తావనే లేదు. పైగా సీసీఎస్‌ప్రాజెక్టుల నిర్వహణకు ఇటీవల పిలిచిన టెండర్లలో తాము దాఖలు చేసిన బిడ్‌లను పరిగణలోకి తీసుకోవద్దని ఆ సంస్థ స్వయంగా లేఖ రాసినా...వారికే కట్టబెట్టాలని అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. ఆ సంస్థకు జీవీఎంసీలోని కీలక అధికారుల అండదండలు ఉండడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను శాస్ర్తీయ పద్ధతిలో కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించాలనే లక్ష్యంతో క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌) ప్రాజెక్టులకు జీవీఎంసీ రూపకల్పన చేసింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ సహకారంతో ముడసర్లోవ, టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లి (అనకాపల్లి)లో సీసీఎస్‌ ప్రాజెక్టులను ఏర్పాటుచేసింది. ఆయా జోన్లలోని ఇళ్ల నుంచి క్లాప్‌ వాహనాలు చెత్తను సేకరించి గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ (జీటీఎస్‌)కు తెస్తే, అక్కడ ఏర్పాటుచేసిన సీసీఎస్‌ ప్రాజెక్టు ద్వారా కంటెయినర్‌ మాదిరిగా ఉండే హుక్‌ లోడర్లలోకి లోడ్‌ చేసి కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు ఎప్పటికప్పుడు తరలిస్తారు. దీనివల్ల చెత్తవాహనం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు దారిపొడవునా గాల్లోకి ఎగిరి వెనుకవచ్చే వాహనచోదకులపై పడడం, దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలు ఉండవు. దీనికోసం జీవీఎంసీయే ప్రాజెక్టును ఏర్పాటుచేసి హుక్‌లోడర్లను, ఆ వాహనాలకు అవసరమైన డీజిల్‌ను సమకూర్చి, నిర్వహణను టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్లను అప్పగిస్తుంది. దీనికోసం ఒక్కో ప్రాజెక్టుకు ఏడాదికి రూ.1.9 కోట్లు వరకు జీవీఎంసీ చెల్లిస్తుంది. గాజువాక, టౌన్‌ కొత్తరోడ్డు, చీమలాపల్లి సీసీఎస్‌ ప్రాజెక్టులను ప్రస్తుతం ‘రాసా’ సంస్థ చూస్తుండగా, ముడసర్లోవలోని సీసీఎస్‌ ప్రాజెక్టును ’మంజునాథ’ అనే సంస్థ నిర్వహిస్తోంది. అయితే గాజువాక, టౌన్‌కొత్తరోడ్డులోని సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణపై సంబంధిత కాంట్రాక్టర్‌ గత కొంతకాలంగా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో అక్కడ తరచూ చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల పారిశుధ్య సమస్య తలెత్తుతుండడంతో ఒక్కోసారి జీవీఎంసీ అధికారులే అద్దెకు టిప్పర్లను పెట్టుకుని చెత్తను కాపులుప్పాడ తరలిస్తున్నారు. కొన్నిసార్లు కాంట్రాక్టర్‌ నిర్వహణ ఖర్చులు మిగులుతాయనే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్‌ టిప్పర్లతో రాత్రిళ్లు చెత్తను తరలిస్తున్నారు. హుక్‌ లోడర్లను తిప్పకపోయినా తిప్పినట్టు చూపించి డీజిల్‌ను తీసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ స్వయంగా టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక సీసీఎస్‌ ప్రాజెక్టులను పరిశీలించినప్పుడు కాంట్రాక్టర్‌ వైఫల్యం కనిపించడంతో రూ.58 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు.

కాంట్రాక్టర్లపై అధికారుల ప్రేమ

కమిషనర్‌ ఆదేశాలతోనైనా కాంట్రాక్టర్‌ నుంచి రూ.58 లక్షలు రికవరీ చేసి, చెత్త తరలింపు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ సొమ్ములు రికవరీ చేయలేదు సరికదా...మరోమారు రెండు ప్రాజెక్టుల నిర్వహణను ఆదే సంస్థకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారు. సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణకు ఇటీవల పిలిచిన టెండర్లలో తాము బిడ్‌ వేసినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని, తాము బిడ్‌ను ఉపసంహరించుకున్నట్టే పరిగణించాలని కోరుతూ ఆ సంస్థ నేరుగా జీవీఎంసీ కమిషనర్‌, చీఫ్‌ ఇంజనీర్‌కు మెయిల్‌ ద్వారా లేఖ పంపించింది. కానీ అధికారులు ఆ సంస్థ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఆ సంస్థకే టెండర్లు కట్టబెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లను అధికారులు ఓపెన్‌ చేయగా, రెండు ప్రాజెక్టుల నిర్వహణకు ఆ సంస్థ ఎంపిక కావడం దీనికి బలాన్ని చేకూర్చుతోంది. ఓపెన్‌ చేసిన టెండర్లను అప్రూవ్‌ చేసేందుకు కమిషనర్‌కు పంపించినట్టు తెలిసింది.

చెత్తతరలింపు నిలిపివేసిన రాసా సంస్థ

బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతుందంటూ గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు జీటీఎస్‌ల నుంచి చెత్తతరలింపును మంగళవారం నుంచి ‘రాసా’ సంస్థ నిలిపివేసింది. దీంతో ఆ రెండు జీటీఎస్‌ల్లో చెత్తకుప్పలు కొండల్లా పేరుకుపోయాయి. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టెండరు అమల్లో ఉండగా చెత్త తరలింపును నిలిపివేసిన సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన అధికారులు ఎందుచేతనో చర్యలకు వెనుకాడుతున్నారు. పైగా ఆ రెండు జీటీఎస్‌లలో పేరుకుపోయిన చెత్తను కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు ఓపెన్‌ టిప్పర్లను జీవీఎంసీ నిధులతో అద్దెకు పెట్టాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది.

Updated Date - Dec 18 , 2025 | 01:28 AM