సత్వరమే అన్నదాత సుఖీభవ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:20 PM
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం అమలు నేపథ్యంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి, అర్హులైన లబ్థిదారులకు ఆ పథకం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
భూముల రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలు వేగవంతం
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం అమలు నేపథ్యంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి, అర్హులైన లబ్థిదారులకు ఆ పథకం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని 22 మండలాల తహశీల్దార్లు, సర్వేయర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో భూముల రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలన్నారు. అటవీ హక్కు పత్రాలు ఇచ్చిన భూముల లబ్ధిదారుల ఆధార్ సీడింగ్ చేసి అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వరదల నేపథ్యంలో జలపాతాలు ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలని, పర్యాటకులను జలపాతాల సందర్శనకు అనుమతించవద్దని పేర్కొన్నారు. అన్ని చోట్లా జలపాతాల ప్రవేశాలను తాత్కాలికంగా మూసి వేయాలన్నారు.
6 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వచ్చే నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 98 వేల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారని, వారందరికీ పంపిణీ ప్రారంభించి వారం రోజుల్లోనే స్మార్ట్ కార్డులు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 671 రేషన్ దుకాణాల్లో 33 దుకాణాలు ఆన్‌లైన్, 638 ఆఫ్‌లైన్‌లో ఉన్నాయన్నారు. రేషన్ దుకాణాలను రెవెన్యూ అధికారులు విధిగా తనిఖీలు చేయాలని, సరుకుల పంపిణీ, బియ్యం నాణ్యతను పరిశీలించాలన్నారు. రేషన్ డిపోల వద్ద క్యూఆర్ కోడ్ ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేయాలని, లబ్ధిదారులు క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలన్నారు. దీపం పథకం -2లో లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను ఇంటికే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, సర్వే విభాగం ఏడీ దేవేంద్రుడు, 22 మండలాల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.