Share News

ఏయూలో క్వాంటం కంప్యూటింగ్‌

ABN , Publish Date - Jul 22 , 2025 | 01:21 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సు నిర్వహణకు సెనేట్‌ ఆమోదం తెలిపింది.

ఏయూలో క్వాంటం కంప్యూటింగ్‌

  • ఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశాలు

  • ఈ ఏడాది నుంచే ప్రారంభం

  • మొదటి సంవత్సరం 30 మందికి అవకాశం

  • ఆమోదం తెలిపిన అకడమిక్‌ సెనేట్‌

  • ఎంటెక్‌ అట్మాస్పియరిక్‌ సైన్స్‌, ఎంటెక్‌ ఓషియానిక్‌ సైన్స్‌ కోర్సులు పునఃప్రారంభం

  • దూరవిద్య పీజీ కోర్సులకు సెమిస్టర్‌ విధానంలో పరీక్షలు

విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సు నిర్వహణకు సెనేట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం జరిగిన సెనేట్‌ సమావేశంలో నూతన కోర్సు ప్రారంభానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశాలను ఈఏపీసెట్‌ ద్వారా కల్పించనున్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో ఈ కోర్సు నిర్వహించనున్నారు. తొలి బ్యాచ్‌లో 30 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన సబ్జెక్టులను కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ఇనుస్ర్టుమెంటేషన్‌, ఈసీఈ తదితర విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు బోధించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటుచేయాలని భావిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా అతికొద్ది విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సును ఏయూలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, మెటీరియాలజీ ఓషనోగ్రఫీ విభాగం నుంచి గతంలో నిర్వహించి నిలిపివేసిన ఎంటెక్‌ అట్మాస్పియరిక్‌ సైన్స్‌, ఎంటెక్‌ ఓషియానిక్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పునఃప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

మరిన్ని నిర్ణయాలు

సెనేట్‌ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏయూ దూర విద్యా కేంద్రం నుంచి నిర్వహిస్తున్న పీజీ కోర్సులకు సంబంధించి వార్షిక పరీక్షల స్థానంలో సెమిస్టర్‌ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. సైన్స్‌ కళాశాల పరిధిలో పలు విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టుల నిర్వహణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా మెరైన్‌ లివింగ్‌ రీసోర్స్‌ విభాగం పరిధిలో ఏడాది కాల వ్యవధితో ఆక్వా కల్చర్‌లో పీజీ డిప్లమో కోర్సును నిర్వహించడానికి ఆమోదముద్ర వేశారు. ఏయూ చిత్రకళా విభాగం, థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగాలను సమన్వయం చేస్తూ స్కూల్‌ ఆఫ్‌ పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఏర్పాటుచేయాలని మాజీ ఉప కులపతులు కొందరు సూచించారు. ఏయూ శతాబ్ది వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో ప్రత్యేక గ్రాంటును అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలని పాలక మండలి సభ్యులు, పూర్వ ఉపకులపతులు సూచించారు. దీనిపై ఏయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేశామని, త్వరలో సమగ్ర ప్రతిపాదనలతో లేఖలు రాయనున్నట్టు వెల్లడించారు. ఏయూ సాధించిన ప్రగతిని, విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను, పూర్వ విద్యార్థులతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో ఏయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.కిశోర్‌బాబు, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఈఎన్‌ ధనుంజయరావు, మాజీ వీసీలు ఎల్‌.వేణుగోపాల్‌రెడ్డి, బీలా సత్యనారాయణ; జీఎస్‌ఎన్‌ రాజు, జి.నాగేశ్వరరావు, పీవీజీడీ ప్రసాదరెడ్డి, పాలక మండలి సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్స్‌, ఫ్యాకల్టీ చైర్మన్లు, అకడమిక్‌ సెనేట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 01:21 AM