ఏయూలో క్వాంటమ్ కంప్యూటింగ్
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:42 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో కొత్త కోర్సును ప్రారంభించేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు
సన్నాహాలు చేస్తున్న అధికారులు
ఈఏపీసెట్ ర్యాంకర్లకు అవకాశం
దక్షిణ భారతదేశంలో తొలి వర్సిటీగా గుర్తింపు
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో కొత్త కోర్సును ప్రారంభించేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన కోర్సులను ప్రవేశపెట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) యత్నిస్తోంది. అందులో భాగంగానే అతికొద్ది విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ జాబితాలో ఏయూ చోటు దక్కించుకుంది.
దక్షిణ భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు నిర్వహించనున్న తొలి వర్సిటీగా ఏయూ గుర్తింపు దక్కించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సును 60 సీట్లతో ప్రారంభించేందుకు వర్సిటీకి అవకాశం దక్కింది. తొలి ఏడాది 30 సీట్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈఏపీసెట్ ర్యాంకర్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులో చేరే విద్యార్థులకు రూ.79 వేలు ఫీజుగా నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ వంటి బ్రాంచ్‌ల మాదిరిగా ప్రత్యేక బ్రాంచ్‌గా ఈ కోర్సును నిర్వహించనున్నారు.
అత్యాధునిక ల్యాబ్‌లు అవసరం
క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు నిర్వహణకు అత్యాధునిక ల్యాబ్‌లు అవసరం. ఇందుకోసం కొన్ని ప్రైవేటు సంస్థల ల్యాబ్ సేవలను వర్చువల్ విధానంలో వినియోగించు కోవాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్‌లు అమెజాన్, మైండ్ ట్రీ, గూగుల్ వంటి సంస్థలకున్నాయి. వాటిని వర్చువల్ విధానంలో బోధనకు వినియోగించుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ కోర్సుగా నిర్వహణ..
క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సును దేశంలోని కొన్ని విద్యా సంస్థలు ఇంటిగ్రేటెడ్ కోర్సుగా నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటున్నారు. భవిష్యత్తు టెక్నాలజీ, ఆవిష్కరణలు దీనిచుట్టే తిరుగుతున్న నేపథ్యంలో కోర్సు నిర్వహణ వర్సిటీకి జాతీయస్థాయిలో గుర్తింపును తీసుకువస్తుందని ఏయూ అధికారులు చెబుతున్నారు.