Share News

పీవీటీజీలకు పెద్దపీట

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:26 PM

షెడ్యూల్డ్‌ తెగల్లో అత్యంత వెనుకబడిన వర్గమైన ఆదిమజాతి ఆదివాసీలు(పీవీటీజీ)లకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి సొంతింటి కల నెరవేర్చేందుకు చర్యలు చేపట్టింది.

పీవీటీజీలకు పెద్దపీట
వర్తనాపల్లి గ్రామంలో పీఎం జన్‌మన్‌ పథకంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు

పీఎం జన్‌మన్‌ పథకంలో భారీగా పక్కా గృహాలు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

అదనంగా రూ.లక్ష సాయం

పీఎం గ్రామీణ్‌ 2.0లో ఇతర కులాలకూ పక్కా ఇళ్లు

చింతపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ తెగల్లో అత్యంత వెనుకబడిన వర్గమైన ఆదిమజాతి ఆదివాసీలు(పీవీటీజీ)లకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి సొంతింటి కల నెరవేర్చేందుకు చర్యలు చేపట్టింది. పీఎం జన్‌మన్‌ పథకంలో భాగంగా అర్హులైన పీవీటీజీలకు భారీ సంఖ్యలో పక్కా గృహాలను మంజూరు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీరికి అదనంగా రూ.లక్ష సాయం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో పీఎం జన్‌మన్‌ పథకంలో 38,385 మందికి, పీఎంఏవై గ్రామీణ్‌ పథకంలో 12,500 మంది పీవీటీజీలకు లబ్ధి చేకూరనున్నది. అలాగే పీఎం గ్రామీణ్‌ 2.0 పథకంలో భాగంగా గిరిజన, ఇతర కులాల లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరు చేసేందుకు హౌసింగ్‌ అధికారులు సర్వే చేపడుతున్నారు.

జిల్లాలోని శివారు గ్రామాల్లో ఆదిమజాతి ఆదివాసీలు నివాసముంటున్నారు. పీవీటీజీలు పెంకుటిల్లు, పూరిళ్లలో నివాసముంటున్నారు. వీరి సంక్షేమానికి గతంలో టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. గతంలో పీవీటీజీ లబ్ధిదారులకు గృహాల నిర్మాణానికి పెంకులు, పక్కా గృహాలు మంజూరు చేసింది. 35 కిలోల రేషన్‌ బియ్యం పంపిణీ చేసే అంత్యోదయ కార్డులను జారీ చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి పీవీటీజీ కుటుంబానికి వ్యక్తిగతంగా పక్కా గృహం ఉండాలనే లక్ష్యంతో అర్హులందరికీ పీఎం జన్‌మన్‌ పథకంలో పక్కా గృహాలను మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు చెల్లించకపోవడం వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయిన 2021-22 పీఎంఏవై గ్రామీణ పథకం గృహాలను పూర్తి చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. ఈ పథకంలో గృహాలు పొందిన పీవీటీజీ లబ్ధిదారులకు సైతం అదనపు నిధులు రూ.లక్ష వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చురుగ్గా పక్కా గృహాల నిర్మాణాలు

గతంలో ఎన్నడూ లేని విధంగా పీవీటీజీలకు కూటమి ప్రభుత్వం పక్కా గృహాలను మంజూరు చేసింది. దీంతో పక్కా గృహాలను పీవీటీజీ లబ్ధిదారులు చురుగ్గా నిర్మించుకుంటున్నారు. పీఎం జన్‌మన్‌ పథకంలో భాగంగా ఒక్కొక్క లబ్ధిదారునికి ప్రభుత్వం తొలి విడతగా రూ.2.39 లక్షల నిధులను కేటాయించింది. ఈ నిధులను పునాదులు నిర్మించుకుంటే రూ.70 వేలు, రూఫ్‌ లెవెల్‌కి రూ.90 వేలు, శ్లాబ్‌ పూర్తి చేసుకుంటే రూ.40 వేలతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 90 పని దినాలకు సంబంధించి రోజు కూలీ రూ.300 చొప్పున రూ.27 వేలు అందజేస్తున్నారు. మరుగుదొడ్లు నిర్మాణానికి రూ.12 వేలు కేటాయిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం వీరికి అదనంగా రూ.లక్ష సాయంగా అందజేస్తోంది. దీంతో పక్కా గృహం నిర్మాణ యూనిట్‌కి రూ.3.39 లక్షలు లబ్ధిదారునికి అందనున్నాయి. పీఎంఏవై గ్రామీణ్‌ పథకంలో నిర్మాణాలు పూర్తి చేసుకోని లబ్ధిదారులకు రూ.1.8 లక్షలతో పాటు అదనపు రూ.లక్ష కలుపుకుని రూ.2.8 లక్షల నిధులు కేటాయించారు. నిర్మాణాలకు సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు వివిధ స్థాయిలో అందజేయడంతో లబ్ధిదారులు పక్కా గృహాలను వేగంగా పూర్తి చేసుకుంటున్నారు. జిల్లాలో పీఎం జన్‌మన్‌లో 38,385 కుటుంబాలు, పీఎంఏవై గ్రామీణ్‌లో 12,500 కుటుంబాలకు పక్కా గృహాలు మంజూరయ్యాయి.

పీఎం గ్రామీణ్‌ 2.0లో ఇతర కులాలకూ పక్కా గృహాలు

కూటమి ప్రభుత్వం పీవీటీజీలతో పాటు షెడ్యూల్డ్‌ తెగలలో ఇతర కులాలకూ పక్కా గృహాలు మంజూరు చేసేందుకు పీఎం గ్రామీణ్‌ 2.0 పథకంలో భాగంగా హౌసింగ్‌ అధికారులు సర్వే చేపడుతున్నారు. జిల్లాలో ప్రతి మండలంలో మూడు వేలకుపైగా పక్కా గృహాలను మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం మార్చి 31 వరకు హౌసింగ్‌ అధికారులు, గ్రామ సచివాలయం ఉద్యోగులు గ్రామాల్లో అర్హులను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేసేందుకు సర్వేను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా పక్కా గృహం నిర్మాణానికి రూ.1.8 లక్షలతో పాటు తాజాగా ప్రభుత్వం అదనంగా ఎస్టీలకు కేటాయించిన రూ.75 వేలు వర్తిస్తుంది. దీంతో పక్కా గృహం నిర్మాణానికి మొత్తం రూ.2.55 లక్షల నిధులు అందనున్నాయి.

Updated Date - Mar 13 , 2025 | 11:26 PM