Share News

లేఅవుట్లపై పెత్తనం!

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:15 AM

నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలపై కొందరు కూటమి పార్టీ ప్రజా ప్రతినిధులు పెత్తనం చేస్తున్నారు.

లేఅవుట్లపై పెత్తనం!

  • అనుయాయులకు ఇళ్ల నిర్మాణ బాధ్యతలు

  • అప్పగించాలని ప్రజా ప్రతినిధుల ఒత్తిడి

  • తలలు పట్టుకుంటున్న హౌసింగ్‌ అధికారులు

  • సంస్థ కార్యకలాపాల్లో

  • మరో నేత పీఏ మితిమీరిన జోక్యం

విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలపై కొందరు కూటమి పార్టీ ప్రజా ప్రతినిధులు పెత్తనం చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని లేఅవుట్‌లలో నిర్మాణ బాధ్యతలను అనుయాయులకు అప్పగించాలని ఒత్తిడి తెస్తుండడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పైగా సంస్థలో అవినీతికి పాల్పడుతున్న కిందిస్థాయి అధికారులను వారు ప్రోత్సహిస్తుండంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

నగరంలో గూడు లేని నిరుపేదల కోసం సుమారు 1.4 లక్షల ఇళ్లు నిర్మించేందుకు శివారు ప్రాంతాల్లో ఐదు వేల ఎకరాల్లో 73 లేఅవుట్లు వేశారు. వైసీపీకి అనుకూలురైన ప్రైవేటు నిర్మాణ సంస్థలకు అనధికారికంగా ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అందులో లక్ష ఇళ్ల పనులు ప్రారంభించారు. గత ఏడాది ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు చేపట్టిన పెద్ద సంస్థల యజమానులు ఆయా ప్రజా ప్రతినిధులను కలిశారు. అయితే ఎవరైనా తమను కలవలేదో...వారిని తప్పించాల్సిందిగా అధికారులపై కొందరు ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. నగర శివారుకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన పరిధిలో గల లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించే సమయంలో తన అనుయాయులకు పనులు అప్పగించాలని ఒత్తిడి తెచ్చారు. అప్పటికే పనులు చేస్తున్న కంపెనీలను తప్పించడంతో వివాదం రేగి పంచాయితీ అమరావతిలో పెద్దల వద్దకు చేరింది. గతంలో పనులు చేసిన వారినే కొనసాగించాలని ఉన్నతస్థాయి ఆదేశాలు వచ్చినా, సదరు ప్రజా ప్రతినిధి ససేమిరా అంటున్నారు. స్థానిక కూటమి పార్టీల నేతలు బుజ్జగించినా పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఆయా లేవుట్‌లలో పనుల పురోగతిపై ప్రతిష్ఠంభన నెలకొంది. దీంతో హౌసింగ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

శివారు ప్రాంతంలో లే అవుట్‌లను పర్యవేక్షించే ఒక అధికారి అవినీతికి పాల్పడుతున్నప్పటికీ, సదరు ప్రజా ప్రతినిధి జోక్యం చేసుకోవడం విమర్శలకు దారితీసింది. కాగా నగరంలో మరో ప్రజాప్రతినిధి కూడా జోక్యం చేసుకుని కొన్ని లేఅవుట్‌లను తాను చెప్పిన వ్యక్తులకు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టరును ఎందుకు తప్పించాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది నుంచి సంస్థ కార్యకలాపాలపై జోక్యం చేసుకుంటున్న మరో నేత పీఏ ఒకరు ఇటీవల మళ్లీ పైరవీలు చేస్తున్నారు. గతంలో హౌసింగ్‌లో పనిచేసి రిటైరైన తరువాత పీఏగా చేరిన ఆ వ్యక్తి, హౌసింగ్‌ విభాగంపై పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా కిందిస్థాయిలో పనిచేసే ఇద్దరు అధికారుల అవినీతి వ్యవహారం సంస్థకు తలనొప్పిగా పరిణమించింది. మందకొడిగా పనులు చేసే సంస్థలను నిర్మాణ బాధ్యతల నుంచి తప్పిస్తామని పైస్థాయి అధికారులు హెచ్చరికలు చేయగా, కిందిస్థాయి అధికారులు వారికి అభయం ఇస్తున్నారు.

Updated Date - Sep 09 , 2025 | 01:15 AM