Share News

అధ్వానంగా పుష్కరిణి

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:54 AM

పట్టణంలో ప్రముఖ శైవక్షేత్రం స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణి దయనీయ స్థితిలో ఉంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, పవిత్రంగా భావించే పుష్కరిణిలో తుప్పలు పెరిగిపోయాయి. చెత్తాచెదారం పేరుకుపోయి డంపింగ్‌ యార్డుగా మారింది. నీరు కలుషితమై దుర్వాసన వస్తున్నది.

అధ్వానంగా పుష్కరిణి
పుష్కరిణిలో పెరిగిపోయిన జమ్ము గడ్డి

చోడవరం స్వయంభూ గౌరీశ్వరాలయంలో పడకేసిన అభివృద్ధి పనులు

గత ఏడాది రూ.80 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే

నవంబరులో పనులు ప్రారంభం.. కొద్ది రోజులకే నిలుపుదల

పరిపాలనాపరమైన ఆమోదం లభించలేదంటున్న అధికారులు

చెత్తాచెదారం, తుప్పలతో దుర్గంభ భరితం

చోడవరం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్రముఖ శైవక్షేత్రం స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణి దయనీయ స్థితిలో ఉంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, పవిత్రంగా భావించే పుష్కరిణిలో తుప్పలు పెరిగిపోయాయి. చెత్తాచెదారం పేరుకుపోయి డంపింగ్‌ యార్డుగా మారింది. నీరు కలుషితమై దుర్వాసన వస్తున్నది.

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాల్లో చోడవరం స్వయంభూ గౌరీశ్వరాలయం ఒకటిగా గుర్తింపు పొందింది. శతాబ్దాల చరిత్ర వున్న ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. కార్తీక మాసంలో భక్తుల తాకిడి అధికంగా వుంటుంది. ఆలయానికి ఆనుకొని వున్న పుష్కరిణిలో కార్తీక మాసంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడం ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి, పోలి పాడ్యమి పర్వ దినాల్లో మహిళలు పూజలుచేసి, పుష్కరిణిలో దీపాలు వదులుతుంటారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ఈ పుష్కరిణిలోనే చక్రస్నానం, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతో ప్రాధాన్యం వున్న పుష్కరిణిని ఐదేళ్ల నుంచి దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. పూడి, చెత్తాచెదారం పేరుకుపోయాయి. జమ్ము గడ్డి బలిసిపోయింది. కొంతమంది స్థానికులు తమ పశువులను పుష్కరిణిలోకి విడిచిపెడుతున్నారు. చివరకు మురికికూపంలా మారిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది.

ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పుష్కరిణిని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు రూ.80 లక్షలు మంజూరు చేయించి, గత ఏడాది నవంబరులో శంకుస్థాపన చేశారు. పుష్కరిణి చుట్టూ ఘాట్‌లు నిర్మించడం, అడుగుభాగంలో కాంక్రీట్‌ నిర్మాణం, బయట నీరు పుష్కరిణిలో రాకుండా ఏర్పాట్లు, పుష్కరిణిలో బోర్లు తీయించి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టారు. తొలుత పుష్కరిణిలో మురుగునీరు బయటకు తోడివేసి, తుప్పలు తొలగించే పనులు ప్రారంభించారు. దీంతో భక్తులు ఎంతో సంతోషించారు. కానీ శంకుస్థాపన చేసి ఎనిమిది నెలలు గడచినా, పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. పాలనపరమైన అనుమతులు రాకపోవడంతో పనులు చేపట్టలేదని అధికారవర్గాల సమాచారం. పరిపాలనాపరమైన అనుమతి ఎప్పుడు వస్తుంది? పనులు ఎప్పుడు మొదలవుతాయి? అన్న ప్రశ్నలకు అధికారుల వల్ల సమాధానాలు లేవు. ప్రస్తుతం వర్షాం కాలం కావడంతో పుష్కరిణిలో అభివృద్ధి పనులు చేయడానికి వీలుకాదు. అక్టోబరు చివరి వారంలో కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. దీంతో కార్తీక మాసంనాటికి పుష్కరిణి బాగుపడే అవకాశాలు లేవని భక్తులు భావిస్తున్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:54 AM