Share News

త్వరలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు పనులు ప్రారంభం

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:22 AM

మరో రెండు నెలల్లో 1,350 మెగావాట్ల సామర్థ్యం గల సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని ఏపీ జెన్‌కో హైడల్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌ తెలిపారు.

త్వరలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు పనులు ప్రారంభం
సీలేరులో రెగ్యులేటర్‌ డ్యాంను పరిశీలిస్తున్న ఏపీ జెన్‌కో హైడల్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌, చిత్రంలో జెన్‌కో అధికారులు

ఏపీ జెన్‌కో హైడల్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జల విద్యుత్‌ కేంద్రాలు, జలాశయాలు, కెనాల్‌ పని తీరుపై ఆరా

సీలేరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మరో రెండు నెలల్లో 1,350 మెగావాట్ల సామర్థ్యం గల సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని ఏపీ జెన్‌కో హైడల్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌ తెలిపారు. హైడల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నుంచి హైడల్‌ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి గురువారం సీలేరు కాంప్లెక్సులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి స్టేజ్‌-1 అనుమతులు ఇటీవల వచ్చాయని, మరో పది, పదిహేను రోజుల్లో స్టేజ్‌-2 ఈసీ అనుమతులు మంజూరుకానున్నాయని ఆయన తెలిపారు. ఈ అనుమతులు వచ్చేలోపు ముందుగా జెన్‌కో ల్యాండ్‌లో సివిల్‌ పనులను ప్రారంభిస్తారన్నారు. స్టేజ్‌- 2 ఈసీ అనుమతులు రాగానే మొదటిగా ప్రాజెక్టుకు మంజూరైన ప్రదేశం హద్దుల్లో ఫెన్సింగ్‌ వేయిస్తామన్నారు. అనంతరం రెండు నెలల తరువాత పూర్తిస్థాయిలో అన్ని పనులు వేగవంతమవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నుంచి గుంటవాడ జలాశయంలోకి నీరు కలిపే ప్రదేశాలను పరిశీలించారు. సీలేరు జల విద్యుత్‌ కేంద్రానికి నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ డ్యాం, గుంటవాడ జలాశయాన్ని పరిశీలించి గేట్ల నిర్వహణ పనితీరుపై స్థానిక ఇంజనీర్లను ఆరా తీశారు. రెగ్యులేటర్‌ డ్యాం, మెయిన్‌ డ్యాం (గుంటవాడ డ్యాం) గేట్ల పని తీరుపై నిత్యం ఇంజనీర్ల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. బలిమెల జలాశయం నుంచి నీటిని వినియోగించుకుంటున్న వివరాలను, జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రానికి వెళ్లి విద్యుదుత్పత్తి, నాలుగు యూనిట్ల పనితీరుపై జలవిద్యుత్‌ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డొంకరాయి చేరుకుని పవర్‌ కెనాల్‌ రీచ్‌ వన్‌ అక్విడెక్ట్‌ వద్ద వెఫ్‌ వాల్స్‌ నుంచి తలెత్తిన లీకేజీ ప్రదేశాన్ని, కెనాల్‌ను, డొంకరాయి జలాశయాన్ని పరిశీలించారు. కెనాల్‌ నుంచి లీకేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఇంజనీర్లు, పెట్రోలింగ్‌ సిబ్బంది పర్యవేక్షించాలని, కెనాల్‌ నుంచి ఏ చిన్న లీకు వచ్చినా అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఇంజనీర్లు రవీంద్రరెడ్డి (విద్యుత్‌ సౌదా), కేవీ రాజారావు(సీలేరు కాంప్లెక్సు), సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఈఈలు బి.బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్‌, భాస్కరరావు, ఏడీఈలు టి.అప్పలనాయుడు, జైపాల్‌, ఏఈఈలు సురేశ్‌, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:22 AM