Share News

21న పల్స్‌ పోలియో

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:53 AM

ఈ నెల 21న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఐదేళ్లలోపు వయసు కలిగిన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ కోరారు.

21న పల్స్‌ పోలియో

జిల్లాలో ఐదోళ్లలోపు కలిగినవారు 2,09,652 మంది

నగర పరిధిలో 1,93,090, గ్రామీణ ప్రాంతాల్లో 16,562 మంది..

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

ఈ నెల 21న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఐదేళ్లలోపు వయసు కలిగిన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ కోరారు. పల్స్‌ పోలియోపై సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అధికారులకు ఆయన పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,09,652 మంది ఉన్నారని, వారిలో నగర పరిధిలో 1,93,090 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 16,562 మంది ఉన్నారన్నారు. పోలియో చుక్కలు వేసేందుకు 1,062 పల్స్‌ పోలియో బూత్‌లు ఏర్పాటుచేశామన్నారు. ఏదైనా కారణంతో ఆరోజు చుక్కలు వేయించుకోని వారికి ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటికి వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తారని, ఇందుకోసం 2004 టీమ్‌లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో 85 హైరిస్క్‌ ప్రాంతాల్లో 6,497 మంది చిన్నారులు ఉన్నారని, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోలియో చుక్కలు వేయాలన్నారు. సంబంధిత జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, సీడీపీవోలు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సిబ్బంది పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషిచేయాలని కలెక్టర్‌ సూచించారు. పల్స్‌ పోలియోపై సినిమా థియేటర్లులో స్లైడ్స్‌, బస్‌ స్టేషన్‌, రైల్వే స్టేషన్‌లలో సీసీటీవీలు ద్వారా ప్రచారాన్ని నిర్వహించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో సత్తిబాబు, జీవీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ వర్మ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకర ప్రసాద్‌, ఎన్‌టీఆర్‌ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.అప్పారావు, జిల్లా ఇమ్యునేషన్‌ అధికారి డాక్టర్‌ బి.లూసీ కార్డిలియా తదితరులు పాల్గొన్నారు.


7 ఇండిగో విమానాలు రద్దు

గోపాలపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ఏడు ఇండిగో విమాన సర్వీస్‌లను సాంకేతిక కారణాలతో సోమవారం రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్‌-విశాఖ-హైదరాబాద్‌, బెంగళూరు-విశాఖ-బెంగళూరు, హైదరాబాద్‌-విశాఖ-హైదరాబాద్‌, చెన్నై-విశాఖ-చెన్నై, హైదరాబాద్‌-విశాఖ-హైదరాబాద్‌, ఢిల్లీ-విశాఖ-ఢిల్లీ, హైదరాబాద్‌-విశాఖ-హైదరాబాద్‌ విమానాలు ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.


చలికి గజగజ

పెందుర్తి సమీపాన గల అక్కిరెడ్డిపాలెంలో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

నగరంతోపాటు పరిసరాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. వాయువ్య భారతం నుంచి మధ్య భారతం మీదుగా వీస్తున్న తీవ్రమైన చలిగాలుల ప్రభావంతో వాతావరణం చల్లగా మారింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ చలి కొనసాగింది. తిరిగి సాయంత్రం ఐదు గంటలకే చలి మొదలైంది. ప్రధానంగా ఏజెన్సీ మీదుగా వీస్తున్న చలిగాలులకు నగరం కంటే శివారు ప్రాంతాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉదయం పూట బయటకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. సోమవారం పెందుర్తి సమీపాన గల అక్కిరెడ్డిపాలెంలో 13.2, పద్మనాభంలో 15.5, భీమిలి సమీపాన గల నారాయణరాజుపేటలో 15.8, విశాఖ ఎయిర్‌పోర్టులో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి. రానున్న మూడు, నాలుగు రోజులు చలి ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - Dec 09 , 2025 | 01:53 AM