Share News

నేటి నుంచి పల్స్‌పోలియో

ABN , Publish Date - Dec 20 , 2025 | 10:30 PM

జిల్లాలో ఆదివారం నుంచి మూడు రోజులు నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమంలో 1 లక్షా 29 వేల 959 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

నేటి నుంచి పల్స్‌పోలియో
పల్స్‌ పోలియో ప్లకార్డులను ప్రదర్శిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎంపీ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు

మూడు రోజులు నిర్వహణ

జిల్లాలో 1.3 లక్షల చిన్నారులకు

వేయనున్న చుక్కల మందు

జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

పాడే రు, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం నుంచి మూడు రోజులు నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమంలో 1 లక్షా 29 వేల 959 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆది, సోమ, మంగళవారాలు నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నారు. ఐదేళ్లు లోపు వయసున్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు మందు వేయాలన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 64 పీహెచ్‌సీల పరిధిలో చుక్కల మందు వేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం పోలియో చుక్కల మందు వేసుకోని చిన్నారుల కోసం 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేస్తారన్నారు. ఇందుకు గానూ 2,506 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 10,024 మంది వ్యాక్సినేటర్లు, 233 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. అలాగే 37 ట్రాన్సిట్‌ పాయింట్‌లు, 74 మొబైల్‌ బృందాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అనంతరం స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అరకులోయ ఎంపీ డాక్టర్‌ జి.తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.కృష్ణమూర్తినాయిక్‌, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.ప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 10:34 PM