Share News

కాఫీ పండ్ల పల్పింగ్‌ ప్రారంభం

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:43 AM

ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్‌ నిర్వహిస్తున్న స్థానిక ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో కాఫీ పండ్ల పల్పింగ్‌ను జిల్లా అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ ఫరీణ్‌ శనివారం ప్రారంభించారు.

కాఫీ పండ్ల పల్పింగ్‌ ప్రారంభం
ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో కాఫీ పండ్ల పల్పింగ్‌ను ప్రారంభిస్తున్న జిల్లా అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ ఫరీణ్‌

మ్యాక్స్‌ ద్వారా ఆదివాసీ రైతులకు గరిష్ఠ ధరలు

ఈ ఏడాది కిలోకి తొలి ధరగా ఏ-గ్రేడ్‌ పండ్లకు రూ.60, బీ- గ్రేడ్‌కు రూ.55

మార్కెటింగ్‌ అనంతరం బోనస్‌ చెల్లింపు

అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ ఫరీణ్‌

చింతపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్‌ నిర్వహిస్తున్న స్థానిక ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో కాఫీ పండ్ల పల్పింగ్‌ను జిల్లా అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ ఫరీణ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ్యాక్స్‌ ద్వారా 1,600 టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామ న్నారు. ఆదివాసీ కాఫీ రైతులకు మ్యాక్స్‌ ద్వారా అంతర్జాతీయ గరిష్ఠ ధరలు అందిస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది కిలోకి రైతుకి గరిష్ఠంగా రూ.60 ధర అందించామన్నారు. ఈ ఏడాది మ్యాక్స్‌ ద్వారా నాణ్యమైన కాఫీ ఉత్పత్తి చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. గిరిజన రైతుల నుంచి నాణ్యమైన పండ్లను సేకరించి పార్చిమెంట్‌ తయారు చేస్తామన్నారు. ఈ ఏడాది ఏజెన్సీ పదకొండు మండలాల్లో అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడలో గత ఏడాది కాఫీ బెర్రీ బోరర్‌ కీటకం ఆశించడంతో ఈ ప్రాంత కాఫీ పండ్లను చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి తరలించడాన్ని నిషేధించామని తెలిపారు. ఇతర మండలాల నుంచి కాఫీ పండ్లను చింతపల్లి తీసుకొచ్చి పల్పింగ్‌ చేస్తామన్నారు. ఏజెన్సీ ఎనిమిది మండలాల నుంచి 1,600 టన్నుల కాఫీ పండ్లు సేరించాలని మండలాల వారీగా అధికారులకు లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ఈ ఏడాది రైతులకు మ్యాక్స్‌ ద్వారా ఏ- గ్రేడ్‌ కాఫీ పండ్లకు రూ.60, బీ- గ్రేడ్‌కు రూ.55 తొలి ధరగా నిర్ణయించామని చెప్పారు. కాఫీ మార్కెటింగ్‌ అనంతరం బోనస్‌ చెల్లిస్తామన్నారు. రైతులు మ్యాక్స్‌కి కాఫీ పండ్లు అందజేసిన రెండు రోజుల్లో నగదు రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కాఫీ లైజన్‌ వర్కర్లు గ్రామాల్లో కాఫీ తోటల వద్దకు వెళ్లి రైతులు సేకరించిన కాఫీ పండ్లను ఎలకా్ట్రనిక్‌ తూనిక యంత్రంతో తూకం చేసి అక్కడే గ్రేడ్‌ నిర్ణయించి రశీదు అందిస్తారన్నారు. ఏ-గ్రేడ్‌ పండ్లను ఎరుపు, బీ- గ్రేడ్‌ పండ్లను పసుపు గోనె సంచుల్లో భద్రపరచి ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి తరలిస్తామన్నారు. రైతులపై రవాణా భారం ఉండదని, మ్యాక్స్‌ రవాణా ఖర్చులు భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఏవో హేమలత, కాఫీ ఏడీ లకే బొంజుబాబు, పదవీ విరమణ పొందిన కాఫీ ఏడీ అప్పలనాయుడు, మ్యాక్స్‌ అధ్యక్షుడు జనకాని సింహాచలం, ఉపాధ్యక్షుడు మర్రి వెంకటరావు, కోశాధికారి మామిడి గోవింద్‌రావు, మ్యాక్స్‌ మాజీ అధ్యక్షుడు సెగ్గె కొండలరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 12:43 AM