Share News

ప్రజా సంక్షేమమే అజెండా

ABN , Publish Date - Dec 16 , 2025 | 01:34 AM

ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతిబాట పట్టించాలన్నదే ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ప్రజా సంక్షేమమే అజెండా

జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతిబాట పట్టించాలి

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సాగాలి

డీఆర్‌సీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర

పంచదార్ల కొండల్లో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు

వచ్చే ఏడాది వేసవిలోగా రహదారులకు మరమ్మతులు

బలవంతంగా మైనింగ్‌ సీనరేజ్‌ వసూలు: స్పీకర్‌ అయ్యన్న ఆరోపణ

ఆ మూడు మండలాలను అనకాపల్లి డివిజన్‌లోనే ఉంచాలని తీర్మానం

అనకాపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతిబాట పట్టించాలన్నదే ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి పాటుపడాలన్నారు. పంచదార్ల పుణ్యక్షేత్రం పరిసరాల్లోని కొండలపై మైనింగ్‌ అనుమతులు జారీ చేయవద్దని, ఆ కొండలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో అన్ని రహదారులకు వచ్చే వేసవిలోగా మరమ్మతులు, అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలలకు చేపట్టిన భవన నిర్మాణాలను మధ్యలో వదిలేసిందని, వాటిని పూర్తి చేయాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సమాధానం ఇస్తూ.. అసంపూర్తిగా వున్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని, అవసరమైతే సీఎస్‌ఆర్‌ నిధులను కూడా వినియోగిస్తామని చెప్పారు.

స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, జిల్లాలో బలవంతంగా మైనింగ్‌ సీనరేజ్‌ వసూలు చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటుకల బట్టీలకు మట్టిని సైతం తీసుకెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇస్తూ.. మైనింగ్‌ విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన సీజరేజీ వసూళ్ల విధానమే కొనసాగిస్తున్నామని, అయితే అనధికారికంగా వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రెవెన్యూ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు అనకాపల్లి పట్టణ, గ్రామీణ రెవెన్యూ కార్యాలయాలుగా విడదీయాలని సూచించారు. బండరాళ్ల వాహనాలు పట్టణం మీదుగా వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, జిల్లాకు పీఆర్‌, ఆర్‌అండ్‌బీ నిధులు రూ.225 కోట్లు రాగా.. లెక్కప్రకారం మాడుగుల నియోజకవర్గానికి రూ.30 కోట్లు కేటాయించాలని, కానీ రూ.15 కోట్లే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై అధికారులతో చర్చించి తగిన విధంగా నిధులు కేటాయింపులు జరిగేలా కృషి చేస్తానని మంత్రి రవీంద్ర హామీ ఇచ్చారు.

ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో వున్న మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను కొత్తగా ఏర్పాటు చేయనున్న నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో చేర్చడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, అందువల్ల ఈ మూడు మండలాలను యథావిధిగా అనకాపల్లి డివిజన్‌లోనే వుంచాలని కోరారు. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆయనకు మద్దతు తెలపడంతో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు.

సమావేశంలో నిర్ణయాలు

అనకాపల్లి పట్టణ వీధుల మీదుగా క్వారీ లారీలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వసతి గృహాల్లో విద్యార్థుల రక్షణకు ప్రత్యక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. రీసర్వే, మ్యుటేషన్‌, అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ, 22(ఎ) తదితర రవెన్యూ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని పలువురు సభ్యులు కోరగా.. కలెక్టర్‌, జేసీలు స్పందిస్తూ చర్యలు చేపడతామన్నారు. మునగపాక, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలను అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి వివిధ శాఖల అధికారులు రూపొందించిన ప్రణాళికలపై చర్చించి అమలు చేసేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జేసీ జాహ్నవి, ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, గాదె శ్రీనివాసులు నాయుడు, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, పీవీజీ కుమార్‌, మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కోట్ని బాలాజీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నాం.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డీఆర్‌సీ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, భవిష్యత్తుట కార్యాచరణపై డీఆర్‌సీలో చర్చించామన్నారు. సభ్యుల సూచనలు, సలహాలు తీసుకొని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. అనకాపల్లి జిల్లా ఆస్పత్రి విస్తరణకు అవసరమైన భూసేకరణపై చర్చించామన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దకు బయట నుంచి వ్యక్తులను తీసుకెళ్లి ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం వైసీపీకి అవసరం లేదన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 01:35 AM