బల్క్ డ్రగ్ పార్కుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:45 AM
మండలంలో ఏర్పాటు కానున్న బల్క్‌డ్రగ్ పార్కుకు సంబంధించి బుధవారం రెండో విడత ప్రజాభిప్రాయసేకరణ సభ జరగనున్నది. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.
నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాట్లు
పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సభ
15-20 మందికే మాట్లాడే అవకాశం
నక్కపల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఏర్పాటు కానున్న బల్క్‌డ్రగ్ పార్కుకు సంబంధించి బుధవారం రెండో విడత ప్రజాభిప్రాయసేకరణ సభ జరగనున్నది. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు కె.కుమారస్వామి, ఎల్.రామకృష్ణ మంగళవారం సాయంత్రం ఇక్కడకు వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. పర్యావరణం, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరుగుతుందని ఆర్డీవో చెప్పారు.
నక్కపల్లి మండలంలో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కాగా బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుకు మొత్తం 1,514 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 700 ఎకరాలకు సంబంధించి రెండున్నరేళ్ల కిందట మొదటి విడత ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. బల్క్‌డ్రగ్ పార్కుకు మరో 814 ఎకరాలకు సంబంధించి బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించేందుకు ఏపీఐఐసీ, పర్యావరణం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భూములు సీహెచ్‌ఎల్ పురం, పెదతీనార్ల, ఎన్.నర్సాపురం, ఉపమాక, ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామాల పరిధిలో వున్నాయి. నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్మిస్తున్న సభావేదిక, ఇతర ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు కె.కుమారస్వామి, ఎల్.రామకృష్ణ పరిశీలించారు. జిల్లాలో వివిధ స్టేషన్ల నుంచి పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం నియమించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిర్వాసితులకు సంబంధించి 15 నుంచి 20 మంది తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం కల్పిస్తారు. కాగా బల్క్ డ్రగ్ పార్కుకు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఆయా గ్రామాల రైతులు, మత్స్యకారులు కొద్ది రోజుల నుంచి సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళలు చేస్తున్నారు.