ప్రజాధనం రాళ్లపాలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:56 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం ఎలా దుర్వినియోగం అయిందో చెప్పడానికి జగనన్న భూరక్ష పథకం కింద రైతుల పొలాల్లో వేయడానికి తెచ్చిన సర్వేరాళ్లు ఉదాహరణగా చెప్పవచ్చు. నాడు రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేయించుకోవడంతో పాటు రైతుల పొలాల్లో వేసిన సర్వేరాళ్లపై కూడా వైఎస్ జగన్ పేరు చెక్కించుకోవడంపై రైతాంగంలో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే.
- గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఫొటోతో సర్వే రాళ్లు
- ఒక్కో రాయికి రూ.300 వరకు ఖర్చు
- రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
- కొన్ని గ్రామాల్లో రాళ్లు పాతగా, మరికొన్ని చోట్ల గుట్టలుగా దర్శనం
- కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ పేరు తొలగింపునకు రూ.12 అదనపు ఖర్చు
చోడవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం ఎలా దుర్వినియోగం అయిందో చెప్పడానికి జగనన్న భూరక్ష పథకం కింద రైతుల పొలాల్లో వేయడానికి తెచ్చిన సర్వేరాళ్లు ఉదాహరణగా చెప్పవచ్చు. నాడు రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేయించుకోవడంతో పాటు రైతుల పొలాల్లో వేసిన సర్వేరాళ్లపై కూడా వైఎస్ జగన్ పేరు చెక్కించుకోవడంపై రైతాంగంలో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే.
రైతుల పొలాల్లో వేయడానికి తెచ్చిన సర్వేరాయి ఒక్కో దానికి రూ.270 నుంచి రూ.300 వరకు ప్రభుత్వం వెచ్చించింది. ఇలా తెచ్చిన సర్వేరాళ్లను కొన్ని గ్రామాల్లో పాతగా, మిగిలిన గ్రామాల్లో ఎక్కడికక్కడ గుట్టలుగా పడేశారు. ఈలోగా ఎన్నికలు రావడం, రైతుల పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రించడం, రైతుల పొలాల్లో సర్వేరాళ్లపై జగన్ పేరుండడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన రేగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి, పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వ అధికార ముద్రతో ఇస్తామని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చాయి. హామీ ఇచ్చిన మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో రైతుల పొలాల్లో పాతిన సర్వేరాళ్లపై జగన్ పేరును తొలగించే చర్యలు తీసుకుంది. జగన్ హయాంలో వేసిన రాళ్లకు ఒక్కోదానికి రూ.300 ఖర్చుపెడితే, వాటిపై పేరు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం అదనంగా మరో రూ.12 వరకూ ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
వృథాగా సర్వే రాళ్లు
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గత ప్రభుత్వం కొనుగోలు చేసిన రాళ్లు చాలా వరకు గ్రామాల్లో వృథాగా గుట్టలుగా ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. ఈ రాళ్లను కొందరు వంటలకు ఉపయోగించే పొయ్యి రాళ్లుగా, మరికొందరు తమ ఇళ్ల వద్ద మురుగునీటి కాలువల వద్ద బురద లేకుండా వేసి ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఈ రాళ్లను వాడుకోగా, మిగిలిన రాళ్లు రోడ్డు పక్కన వృథాగా పడి ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం వెచ్చించిన ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అయిందో చెప్పడానికి ఈ సర్వేరాళ్లే ఓ నిదర్శనంగా గ్రామాల్లో కనిపిస్తున్నాయి.