సందడిగా పీటీఎం
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:13 AM
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్, టీచర్ సమావేశాలు సందడిగా జరిగాయి.
జిల్లాలోని 594 ప్రభ్వు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్, టీచర్ సమావేశాలు
ప్రతి విద్యార్థి ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చించిన ఉపాధ్యాయులు
స్థానిక శాసనసభ్యులు హాజరు
విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్, టీచర్ సమావేశాలు సందడిగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ 585 ప్రభుత్వ, జడ్పీ, జీవీఎంసీ పాఠశాలలు, బీసీ/ఎస్సీ/ఎస్టీ రెసిడెన్సియల్ పాఠశాలలు, కేజీబీవీలు, తొమ్మిది జూనియర్ కళాశాలల్లో విద్యా శాఖ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల ప్రగతి గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. బాల్య వివాహాలు నిర్మూలన, ఇతర విద్యా సంబంఽధ అంశాలపై చర్చించారు. అనంతరం తల్లిదండ్రుల నుంచి సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్న చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు అక్కయ్యపాలెం ఎన్జీజీవో కాలనీలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్, టీచర్ సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులతో ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నడుపూరు ఉన్నత పాఠశాలలో, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆనందపురం కేజీబీబీ, భీమిలి జూనియర్ కళాశాల, పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు శ్రీహరిపురం, ఆర్‌ఆర్‌పేటలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాల, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పెందుర్తి ఉన్నత పాఠశాల, దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణశ్రీనివాస్ ప్రకాశరావుపేట, డాబాగార్డెన్స్‌లోని జీవీఎంసీ పాఠశాలల్లో జరిగిన మెగా పేరెంట్, టీచర్ సమావేశాలకు హాజరయ్యారు. జిల్లాలో మెగా పేరెంట్, టీచర్ సమావేశాలను డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్, సమగ్రశిక్షా ఏపీసీ చంద్రశేఖరరావు పర్యవేక్షించారు.
ఎకనామిక్ రీజియన్లో ఇరవై లక్షల ఉద్యోగాలు
అందుకు అనుగుణంగా కీలక రంగాలను అభివృద్ధి చేయాలి
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) సీఈఓ యువరాజ్
మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి
2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చాలనేది లక్ష్యం
విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కీలక రంగాలను అభివృద్ధి చేయాల్సి ఉందని పరిశ్రమల శాఖ సెక్రటరీ, వీఈఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) యువరాజ్ అన్నారు. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రాంత ఐఏఎస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీతి ఆయోగ్ సూచనల మేరకు 21,880 చ.కి.మీ. విస్తీర్ణంలో వీఈఆర్ ప్రాజెక్టును ప్రతిపాదించారన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా ఇది ఏర్పాటైందన్నారు. దీనిని 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చాలనేది సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన లక్ష్యంగా పేర్కొన్నారు. దీనిని సాధించడానికి పోర్టుల ద్వారా వ్యాపార అవకాశాలు విస్తృతం చేయడం, ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ కేంద్రాల అభివృద్ధి, వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలను బలోపేతం చేయడం, పర్యాటక రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పెంపొందించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైల్వే, రోడ్లు, పోర్టులను అభివృద్ధి చేయడం వంటివి ప్రణాళికలో పొందుపరిచామన్నారు. విశాఖపట్నం ప్రస్తుతం ప్రధానంగా పోర్టులు, భారీ పరిశ్రమలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సముద్ర ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా బలోపేతంగా ఉందన్నారు. మిగిలిన రంగాలను కూడా సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ ప్రతినిధి ఎస్.కిశోర్, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కమిషనర్ రమేశ్, కార్యదర్శి మురళీకృష్ణ, సీయూపీ శిల్ప, ఈఈలు భవానీశంకర్, మధుసూదనరావు పాల్గొన్నారు.