హైడ్రో ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:56 PM
అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల పరిధిలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
అరకులోయ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల పరిధిలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ సోమవారం అరకులోయ మండలం తొరడంవలస గ్రామం నుంచి లోతేరు వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌లు మాట్లాడుతూ సాగు, అటవీ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజనులు సాగు చేసుకునే పంట పొలాలు, కాఫీ తోటలు జల సమాధి అయ్యే ప్రమాదం ఉందన్నారు. అదానీ, నవయుగ కంపెనీలకు అటవీ భూములను ధారాదత్తం చేస్తారా? అని మండిపడ్డారు. అనంతరం అదానీ, నవయుగ కంపెనీల యాజమాన్యాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల నేతలు టి.కృష్ణారావు, కిల్లో బుజ్జిబాబు, రామారావు, పోరాట కమిటీ కన్వీనర్ కొర్రా స్వామి, గ్రామ పెద్దలు గుబ్బాయి శ్రీరాములు, పెసా కమిటీ సభ్యులు కిల్లో రామన్న, భీమ, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.