Share News

ఆడ బిడ్డల రక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:14 PM

సమాజంలో ఆడ బిడ్డల రక్షణ బాధ్యత మనందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ అన్నారు. స్థానిక కాఫీ హౌస్‌లో గురువారం నిర్వహించిన 8వ రాష్ట్రీయ పోషణ్‌ మహోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఆడ బిడ్డల రక్షణ అందరి బాధ్యత
సహజ పోషకాల ప్రదర్శన తిలకిస్తున్న డాక్టర్‌ రాయపాటి శైలజ

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ

ఘనంగా పాడేరులో 8వ రాష్ట్రీయ పోషణ్‌ మహోత్సవం

పాడేరు, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): సమాజంలో ఆడ బిడ్డల రక్షణ బాధ్యత మనందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ అన్నారు. స్థానిక కాఫీ హౌస్‌లో గురువారం నిర్వహించిన 8వ రాష్ట్రీయ పోషణ్‌ మహోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ప్రతి మహిళా ఒక వ్యాపార వేత్తగా ఎదిగే ందుకు కృషి చేయాలని సూచించారు. మహిళలు తమ ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. అందుకు గాను అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషించాలని ఆమె సూచించారు. సమష్టి కృషితో మాతా శిశు మరణాలను అరికట్టాలని, అందుకు సూచించిన పద్ధ్దతులను మహిళలు పాటించాలన్నారు. ఆడ పిల్లల చదువుపై నిర్లక్ష్యం వహించవద్దని, బాలికల విద్యే సమాజానికి అవసరమనేది ప్రతి ఒక్కరూ గుర్తించి బాలికా విద్యను ప్రోత్సాహించాలన్నారు. బాలికలు విద్యలో డ్రాపవుట్స్‌ కాకుండా అధికారులు చూడాలని సూచించారు. బాల్య వివాహాలకు అవకాశం లేకుండా గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు పని చేయాలని, వాటి వలన కలిగే నష్టాలపై బాలికలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సోషల్‌ మీడియా, సైబర్‌ నేరాల పట్ల బాలికలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పొరపాటున కూడా ఆకర్షణకు లోనుకావద్దని ఆమె అన్నారు. కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో మహిళల రక్షణకు పలు రకాల కమిటీలను ఏర్పాటు చేసి, అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి, వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. అంతకు ముందు ఆమె గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహజ పోషకాల ప్రదర్శనను తిలకించి, పలువురు బాలింతలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసాన చేశారు. పలువురు గిరిజన మహిళా వ్యాపార వేత్తలకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌తో కలిసి జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, డీఎస్‌పీ షెహబాజ్‌ అహ్మద్‌, జిల్లాలోని సీడీపీవోలు, మహిళా రక్షణ కమిటీ ప్రతినిధులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 11:14 PM