Share News

స్పా ముసుగులో వ్యభిచారం!

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:28 AM

నగరంలోని కొన్ని స్పా సెంటర్లు వ్యభిచార గృహాలుగా మారిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్పా ముసుగులో వ్యభిచారం!

  • టాస్క్‌ ఫోర్స్‌ దాడితో రెండు కేంద్రాల గుట్టురట్టు

  • పట్టుబడిన విటులు...నిర్వాహకులపై కేసులు

  • నగరంలోని పలు మసాజ్‌ సెంటర్లలో చీకటి కార్యకలాపాలు

  • నిబంధనలకు విరుద్ధంగా క్రాస్‌ మసాజ్‌లు

  • పోలీసులకు నెలవారీ మామ్మూళ్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని కొన్ని స్పా సెంటర్లు వ్యభిచార గృహాలుగా మారిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెల్‌నెస్‌, మసాజ్‌ పేరుతో బోర్డులు పెట్టి, లోపల చీకటి వ్యవహారాలు నడుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈనెల 17, 18 తేదీల్లో రెండు స్పా సెంటర్‌లపై దాడి చేయగా అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు తేలింది. దీంతో నిర్వాహకులపై కేసులు పెట్టారు.

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 300కిపైగా మసాజ్‌ సెంటర్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయి. బ్యూటీషియన్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ను ఉల్లంఘించి తమ సెంటర్లలో అందించే సేవలకు పోలీసుల నుంచి ఆటంకం లేకుండా ఉండేందుకు నెలవారీ మామ్మూళ్లు ముట్టజెపుతున్నాయి. స్పాల్లో అందజేసే సేవలను బట్టి ఈ మామ్మూళ్లు నిర్ణయించడంతో పాటు వసూలుచేసి పోలీసులకు అప్పగించే బాధ్యతను కూడా కొన్ని సెంటర్ల నిర్వాహకులే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. క్రాస్‌ మసాజ్‌లు చేసే సెంటర్లు అయితే నెలకు రూ.పది వేలు, అదే వ్యభిచారం అనుమతించే స్పా సెంటర్లు అయితే రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ మామూళ్లు అందజేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

శారీరకంగా అలసిపోయిన వారికి, కండరాల బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్న వారికి వాటి నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు కాస్మోటిక్స్‌ (అందానికి)కు సంబంధించిన సేవలు మాత్రమే ‘స్పా’లు, వెల్‌నెస్‌ సెంటర్స్‌లో అందించాలి. ఇవన్నీ ‘బ్యూటీషియన్‌ అండ్‌ కాస్మోటిక్‌’ రంగం కింద గుర్తించబడతాయి. స్పా, మసాజ్‌ సెంటర్‌లు, రిలాక్స్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ సెంటర్స్‌ వంటి పేర్లతో ఇవన్నీ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఇలాంటి వాటిలో క్రాస్‌ జెండర్‌ (మగవారికి ఆడవాళ్లు, ఆడవారికి మగవారు) మసాజ్‌ చేయడాన్ని చట్టం అనుమతించదు. మసాజ్‌ సెంటర్‌/స్పాలో చీకటి కార్యకలాపాలకు తావులేకుండా ఉండేందుకు పురుషులకు, మహిళలకు వేర్వేరు సెక్షన్లు ఏర్పాటుచేయాలని చట్టంలో పేర్కొన్నారు. స్పాల్లోకి వెళ్లేవారికి ఒక మార్గం, బయటకు వచ్చేవారికి మరొక మార్గం వేర్వేరుగా అందుబాటులో ఉంచాలి. పురుషులకు, మహిళలకు టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌లు కూడా వేర్వేరుగా ఏర్పాటుచేయాలి. స్పా/మసాజ్‌ సెంటర్లలో ఒక గది నుంచి మరొక గదిలోకి వెళ్లేందుకు అంతర్గత ద్వారాలు ఉండకూడదు. పది మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్టయితే వారందరికీ గుర్తింపుకార్డులు ఇవ్వడం, మహిళా సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ విభాగం వంటివి అందుబాటులో ఉంచాలి. మసాజ్‌ సెంటర్‌/స్పాలో ఫిజియోథెరపిస్ట్‌ లేదా ఆక్యుప్రెజర్‌ లేదా ఆక్యుపేషనల్‌ థెరపీలో డిగ్రీ, డిప్లొమో లేదంటే సర్టిఫికెట్‌ కోర్సు చేసిన వాళ్లను మాత్రమే నియమించుకోవాలి. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంచాలి. అలాగే సెంటర్‌కు వచ్చే వినియోగదారులకు అందించే సేవలను వీడియో రికార్డు చేసేలా అన్నిచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలి. కనీసం మూడు నెలల ఫుటేజీ స్టోరేజీ ఉండేలా హార్డ్‌ డిస్క్‌ను ఏర్పాటుచేసుకోవాలి. కానీ నగరంలోని మసాజ్‌సెంటర్‌/స్పాల్లో మాత్రం ఈ నిబంధనలేవీ మచ్చుకైనా అమలుకావడం లేద నేది బహిరంగ రహస్యం.

మసాజ్‌ ముసుగులో వ్యభిచారం

నగరంలోని మసాజ్‌ సెంటర్‌లు/స్పాల్లో కొన్నింటిలో మినహా మిగిలిన వాటన్నింటిలోనూ క్రాస్‌ జెండర్‌ మసాజ్‌లు, వ్యభిచారం వంటివి విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. థాయ్‌లాండ్‌, కేరళ, గోవా వంటి ప్రాంతాల నుంచి యువతులను నగరానికి తెప్పించి వారితో మసాజ్‌ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీపీ శంఖబ్రతబాగ్చికి సమాచారం అందడంతో ఈనెల 17న రామాటాకీస్‌ సమీపంలోని మినీథాయ్‌స్పాలో తనిఖీలు చేయాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీ చేసి వ్యభిచారం కోసం ఉన్న ఐదుగురు యువతులు, ఒక విటుడితోపాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్‌లో భారీగా కండోమ్‌ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అలాగే శుక్రవారం ద్వారకానగర్‌ మొదటిలైన్‌లోని లావీస్‌ థాయ్‌ స్పాలో టాస్క్‌ఫోర్స్‌, ద్వారకా నగర్‌ స్టేషన్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించి నలుగురు యువతులు, ఇద్దరు విటులు, ఒక నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నగరంలో ఈ తరహా కార్యకలాపాలు చాలా స్పా సెంటర్లలోనూ జరుగుతున్నాయని అంటున్నారు. పోలీసులు, ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేస్తే ఇలాంటి చీకటి కార్యకలాపాలన్నీ బట్టబయలయ్యే అవకాశం లేదు.

Updated Date - Jul 20 , 2025 | 01:28 AM