ఆస్తి పన్ను వసూళ్లు ఆశాజనకం
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:28 AM
జీవీఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధసంవత్సరం ముగిసేసరికి రూ.256.5 కోట్లు వసూలుకాగా, వచ్చే ఆరు నెలల్లో మరో రూ.274.49 కోట్లు వసూలుచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధసంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రూ.50.25 కోట్లు అధికంగా వ సూలు కావడం విశేషం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
తొలి ఆరునెలల్లో రూ.256.5 కోట్లు వసూలు
గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే రూ.50.25 కోట్లు అధికం
వచ్చే ఆరు నెలల్లో మరో రూ.274.49 కోట్లు
వసూలు చేయాలని లక్ష్యం
ఫలిస్తున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కార్యాచరణ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధసంవత్సరం ముగిసేసరికి రూ.256.5 కోట్లు వసూలుకాగా, వచ్చే ఆరు నెలల్లో మరో రూ.274.49 కోట్లు వసూలుచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధసంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రూ.50.25 కోట్లు అధికంగా వ సూలు కావడం విశేషం.
జీవీఎంసీ పరిధిలో 5,98,835 అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వీటిద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.400.32 కోట్లు ఆసి ్తపన్ను, ఇప్పటివరకూ ఉన్న బకాయిల నుంచి రూ.130.67 కోట్లు మొత్తం రూ.530.99 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కమిషనర్‌గా కేతన్‌గార్గ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవీఎంసీకి ఆదాయం పెంచే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఆస్తి పన్ను, ఖాళీస్థలాల పన్నును ఎప్పటికప్పుడు వసూలుచేయడంతోపాటు బకాయిలు కూడా రాబట్టేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని రెవెన్యూ విభాగం డిప్యూటీ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావును ఆదేశించారు. అలాగే పన్ను పరిధిలోకి రాకుండా ఉండిపోయిన భవనాలు, ఖాళీ స్థలాలకు అసెస్‌మెంట్‌లు జారీచేయడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని సూచించారు. కమిషనర్ ఆదేశాల మేరకు పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయినా సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కార్యాలయాలకు రెవెన్యూ విభాగం డిప్యూటీ కమిషనర్ స్వయంగా వెళ్లి సంప్రతింపులు ప్రారంభించారు. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలి ఆరు నెలల్లోనే రూ.29.25 కోట్ల వరకూ బకాయిలు వసూలయ్యాయి. మరోవైపు పన్ను వసూళ్లలో పురోగతిపై కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రతి బుధవారం రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్నారు. జోన్‌ల వారీగా లక్ష్యాలు నిర్దేశించి, వాటిని ఏ మేరకు చేరుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. దీంతో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్ల కోసం క్షేత్రస్థాయికి వెళ్లడం ప్రారంభించారు. దీంతో ఈ ఏడాది తొలి అర్ధసంవత్సరంలో బకాయిలతో కలుపుకుంటే రూ.256.5 కోట్లు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధసంవత్సరం ముగిసేసరికి రూ.206.25 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఈ ఏడాది రూ.50.25 కోట్లు అధికంగా వసూలైంది. మిగిలిన ఆరు నెలల్లో బకాయిలు రూ.101.42 కోట్లు, రెగ్యులర్ పన్నులు ద్వారా రూ.173.07 కోట్లు మొత్తం మరో రూ.274 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగాపెట్టుకున్నారు. కమిషనర్ రూపొందించిన కార్యాచరణను పక్కాగా అమలుచేయడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న రూ.530.99 కోట్లు వసూలు చేస్తామని డీసీఆర్ శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తంచేశారు.