పక్కాగా ఆస్తి పన్ను వసూళ్లు
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:07 AM
మునిసిపాలిటీలో ఆస్తి పన్ను మదింపు చేయని కొత్త ఇళ్లు, ఇప్పటికే వున్న భవనాలపై అదనపు నిర్మాణాలను గుర్తించడానికి అధికారులు నాలుగు నెలలుగా సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు 8,200 నివాసాలను సర్వే చేయగా, ఇంకా 6,400 ఇళ్లు సర్వే చేయాల్సి ఉంది. 262 కొత్త ఇళ్లు, 493 అదనపు నిర్మాణాలను గుర్తించారు.
ఇంతవరకు పన్ను మదింపు చేయని నివాసాల గుర్తింపునకు సర్వే
ఇప్పటికే ఉన్న భవనాలపై అదనపు నిర్మాణాలు సైతం..
ఇప్పటి వరకు 8,200 ఇళ్ల సర్వే పూర్తి
పన్ను చెల్లించని కొత్త ఇళ్లు 262, అదనపు నిర్మాణాలు చేసినవి 493
ఇంకా సర్వే చేయాల్సిన ఇళ్లు 6,400
నర్సీపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో ఆస్తి పన్ను మదింపు చేయని కొత్త ఇళ్లు, ఇప్పటికే వున్న భవనాలపై అదనపు నిర్మాణాలను గుర్తించడానికి అధికారులు నాలుగు నెలలుగా సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు 8,200 నివాసాలను సర్వే చేయగా, ఇంకా 6,400 ఇళ్లు సర్వే చేయాల్సి ఉంది. 262 కొత్త ఇళ్లు, 493 అదనపు నిర్మాణాలను గుర్తించారు.
మునిసిపాలిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కాకుండా, ఇళ్ల పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన ఆర్థిక వనరు. ఆస్తి పన్ను వసూళ్లు ద్వారా వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి పనులు జరుగుతాయి. ఆస్తి పన్ను వసూళ్లనుబట్టే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు గ్రాంట్ మంజూరు చేస్తుంది. దీంతో మునిసిపాలిటీలో ప్రతి ఇంటి నుంచి ఆస్తి పన్ను వసూలుకు అధికారులు నడుం బిగించారు. ఇందుకోసం నాలుగు నెలల క్రితం ఇంటింటా సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు 8,200 ఇళ్ల సర్వే పూర్తి చేశారు. ఇంకా 6,400 ఇళ్లు సర్వే చేయాల్సి ఉంది. ఆస్తి పన్ను చెల్లించని 262 కొత్త ఇళ్లను గుర్తించారు. అలాగే 493 అదనపు నిర్మాణాలు గుర్తించి ఆస్తి పన్ను విధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. పక్కాగా దస్తావేజులు ఉన్న ఇంటికి సంబంధిత యజమాని పేరు మీద ఆస్తి పన్ను వేస్తున్నారు. ఇంటి దస్తావేజులు లేని వాటికి అసెస్‌మెంట్ నంబరు ఇచ్చి పేరు దగ్గర ‘హోల్డ్ ఆఫ్ ది ప్రిమిసెస్’ అని పేర్కొంటూ పన్ను వేస్తున్నారు. ఉదాహరణకు మూడు అంతస్థులకు ప్లాన్ తీసుకొని, ఆర్థిక వెసులుబాటునుబట్టి రెండు అంతస్థులు నిర్మించి,మూడో అంతస్థు శ్లాబ్ ఖాళీగా వుంచుతున్నారు. ఇటువంటి వారి నుంచి రెండు అంతస్థులకు మాత్రమే ఆస్తి పన్ను విధిస్తారు. భవన యజమాని డబ్బులు అందుబాటులో వున్నప్పుడు మూడో అంతస్థు పూర్తి చేస్తుంటారు. సర్వేలో ఇటువంటి వాటిని గుర్తించి పన్ను మదింపు చేస్తున్నారు. అలాగే వారసత్వంగా వచ్చిన స్థలం ఉండి, దస్తావేజులు లేక ప్లాన్ అనుమతులు తీసుకోకుండా నిర్మించిన ఇళ్లను, అదే విధంగా ప్లాన్ అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లు గుర్తిస్తున్నారు. కాగా మునిసిపాలిటీలో ఆస్తి పన్ను డిమాండ్ రూ.5.9 కోట్లు ఉంది. సర్వేలో గుర్తించిన కొత్త ఇళ్లు, అదనపు నిర్మాణాలను కలుపుకుంటే ఈ ఆదాయం మరికొంత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.