పక్కాగా భూముల రీసర్వే ప్రక్రియ
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:29 AM
భూముల రీసర్వే ప్రక్రియను పక్కాగా నిర్వహించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.

నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయండి
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వే ప్రక్రియను పక్కాగా నిర్వహించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పాడేరు డివిజన్ పరిధిలోని మండల సర్వేయర్లు, సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, గ్రామ సర్వేయర్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించి భూ సరిహద్దులను సక్రమంగా గుర్తించాలన్నారు. సర్వే చేసేందుకు గానూ ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే 22ఏ ప్రకారం భూముల రిజిస్ర్టేషన్‌కు ఫారం-కె, ఫారం-ఎల్‌లను ఆన్‌లైన్ చేస్తామ న్నారు. భూముల సర్వే నిర్వహిస్తున్నట్టు ముందుగానే ఆయా గ్రామాలకు సమాచారం అందించాలని, సర్వేపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ మాట్లాడుతూ భూముల రీసర్వేను ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాల న్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌లో మండ లానికి రెండు గ్రామాలను పైలట్ గ్రామాలుగా తీసుకుని సర్వే చేస్తున్నామని, డివిజన్ పరిధిలో 375 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారని, రికార్డు వర్కు పూర్తి చేయాల్సి ఉందన్నారు. విలేజ్ సర్వేయర్ల లాగిన్‌లో 89, వీఆర్‌వోల లాగిన్‌లో 141, డిప్యూటీ తహసీల్దార్ల లాగిన్‌లో 15, తహసీల్దార్ల లాగిన్‌లో 78 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గ్రామసభలు నిర్వహించి 13 నోటిఫికేషన్ జారీ చేయాలని, భూ రికార్డుల క్రమబద్ధీకరణ, వెక్టరైజేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అవసరమైన చోట మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, సర్వే పూర్తి చేయకపోతే గ్రామ సర్వేయర్లపై కఠిన చర్యలు చేపడతామని జేసీ హెచ్చరించారు. తప్పుడు సర్వేలు చేయడం, సర్వే చేయడానికి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై గ్రామాల్లో ఎవరు సర్వే చేశారో విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సర్వే సహాయ సంచాలకుడు కె.దేవేంద్రుడు, ఏజెన్సీ పదకొండు మండలాలకు చెందిన మండల సర్వేయర్లు, సర్వే విభాగం డిప్యూటీ తహసీల్దార్లు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.