Share News

అర్హులందరికీ పక్కా ఇళ్లు

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:33 AM

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- గ్రామీణ (పీఎంఏవై-జీ) కింద పక్కా ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్నది.

అర్హులందరికీ పక్కా ఇళ్లు

పీఎంఏవై-జీ కింద మంజూరుకు కేంద్ర గ్రీన్‌ సిగ్నల్‌

సొంత స్థలం ఉంటే సచివాలయాల్లో దరఖాస్తు

గ్రామాల్లో యూనిట్‌కు రూ.1.59 లక్షలు, పట్టణాల్లో రూ.2.8 లక్షలు

దరఖాస్తుకు రేపటితో ముగియనున్న గడువు

గ్రామాల్లో కూడా యూనిట్‌ ధర రూ.2.8 లక్షలకు పెంచాలని పలువురి వినతి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- గ్రామీణ (పీఎంఏవై-జీ) కింద పక్కా ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఇంతవరకు సుమారు 16 వేల దరఖాస్తులు అందాయి. బుధవారంతో గడువు ముగియనున్నది.

ఇళ్లు లేని పేదలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించింది. జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు జిల్లాలో సొంత ఇల్లు లేని వారి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. పీఎంఏవైజీ 2.0 కింద పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. అర్హులైన వారు ఈ నెల 5వ తేదీలోగా సమీపంలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. దరఖాస్తుదారులకు సొంత స్థలం ఉండాలి. దీనికి సంబంధించి డాక్యుమెంట్‌/డి.పట్టా/పొసెషన్‌ సర్టిఫికెట్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా వుండాలి. దీంతోపాటు బియ్యం కార్డు, కుల ధ్రువీకరణపత్రం, భార్యాభర్తలు ఆధార్‌ జెరాక్స్‌ కాపీలతో సచివాలయానికి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

రేపటితో ముగియనున్న గడువు

సొంత ఇంటి మంజూరుకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 5వ తేదీ వరకే గడువు వుంది. పట్టణాల్లో యూనిట్‌ ధర (ఒక ఇల్లు) ఽరూ.2.8 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.59 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 16,.029 దరఖాస్తులు అందాయి. వీటిలో 464 దరఖాస్తులు పట్టణ, 15,506 దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయి. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి అత్యధికంగా 3,863 మంది, పెందుర్తి నియోజకవర్గం నుంచి తక్కువగా 301 దరఖాస్తులు అందాయి. అనకాపల్లి నుంచి 2,051, మాడుగుల నుంచి 3,258, నర్సీపట్నం నుంచి 1,306, ఎలమంచిలి నుంచి 2,273 దరఖాస్తులు వచ్చాయి. కాగా భవన నిర్మాణ సామగ్రి, కూలి రేట్లు పెరిగినందున గ్రామాల్లో కూడా ఒక్కో ఇంటికి రూ.2.8 లక్షల చొప్పున మంజూరు చేయాలని గ్రామీణ లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయమై కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు గృహ నిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. పక్కా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగుస్తుందని చెప్పారు.

Updated Date - Nov 04 , 2025 | 01:33 AM