భాషా పండిట్లకు పదోన్నతులు
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:46 AM
ఆరేళ్ల నిరీక్షణ అనంతరం తెలుగు/హిందీ భాషా పండిట్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
క్లస్టర్ల పరిధిలోనే విధులు
ప్రస్తుత పాఠశాలలోనే కొనసాగే అవకాశం
ఉమ్మడి జిల్లాలో 78 మందికి ఉత్తర్వులు
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
ఆరేళ్ల నిరీక్షణ అనంతరం తెలుగు/హిందీ భాషా పండిట్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొనసాగుతున్న భాషా పండితులకు కల్పించిన స్కూల్ అసిస్టెంట్ కేడర్ పదోన్నతులు ఈ నెల మూడోతేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 75 మంది తెలుగు, ముగ్గురు హిందీ భాషా పండితులకు ప్రయోజనం చేకూరింది.
ఉమ్మడి ఏపీలో నిర్వహించిన డీఎస్సీల ద్వారా నియమితులైన భాషా పండితుల్లో కొంతమందికి గతంలోనే గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 పదోన్నతులు కల్పించారు. చివరిగా 2019లో కొంతమందికి పదోన్నతులు ఇచ్చి, మిగిలిన వారిని డీఈవో పూల్‌లో ఉంచేశారు. దీనిపై భాషా పండితులు గత ప్రభుత్వంతో పోరాడినా ఫలితం దక్కలేదు. డీఈవో పూల్‌లో ఉన్న కారణంగా టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ జరిగిన ప్రతిసారీ వీరికి బదిలీలు తప్పనిసరయ్యేవి. దీంతో ఎక్కడా రెండేళ్లకు మించి పనిచేయలేకపోయారు. సాధారణంగా ఒకచోట బదిలీ అయితే ఎనిమిదేళ్ల వరకు అక్కడే పనిచేసుకునే వెసులుబాటు ఎస్జీటీ/స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లకు ఉంది. కానీ డీఈవో పూల్‌లోని భాషాపండిట్లకు ఈ అవకాశం కల్పించలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తదితరులు ఈ సమస్యను మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ మేరకు డీఈవో పూల్‌లో ఉన్న ఉమ్మడి జిల్లా పరిధిలోని 75 మంది తెలుగు, ముగ్గురు హిందీ పండితులకు అడహక్ బేసిక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తూ విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. దీనివల్ల ఇప్పటికే క్లస్టర్ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న పండితులు అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు క్లస్టర్ స్కూళ్ల పరిధిలో (ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు) ఎక్కడైనా టీచర్లు సెలవు పెడితే అక్కడికి వెళ్లి బోధించాల్సి వచ్చేది. తాజా పదోన్నతుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న చోటే పనిచేయాలి. అంతేకాదు వచ్చే ఏడాది నిర్వహించే బదిలీ కౌన్సెలింగ్‌లో మిగిలిన టీచర్లతోపాటు వీరికీ అవకాశం కల్పిస్తారు. కాగా ఆరేళ్ల నుంచి పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న తమకు న్యాయం చేసిన ప్రభుత్వానికి, సహకరించిన మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు వై.దయానంద్ ధన్యవాదాలు తెలిపారు.
అంతర్ జిల్లా బదిలీ టీచర్లకు పోస్టింగ్స్
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాకు బదిలీపై వచ్చిన 48 మంది ఉపాధ్యాయులకు విద్యా శాఖ పోస్టింగ్స్ ఇచ్చింది. వీరిలో 16 మంది స్కూల్ అసిస్టెంట్, 32 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. ఎక్కువమందికి కేటగిరీ 3, 4 పరిధిలోని పాఠశాలల్లో పోస్టింగ్స్ దక్కాయి. దీనిపై కొందరు టీచర్లు అభ్యంతరం వ్యక్తంచేసి ఆందోళనకు దిగినా.. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏజెన్సీ, మారుమూల ప్రాంత పాఠశాలల్లో నియమించారు.