ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం
ABN , Publish Date - May 23 , 2025 | 11:04 PM
జిల్లాలో వ్యవసాయాధారిత ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్‌లు నెలకొల్పడానికి ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
తేనె యూనిట్లకు 100 మందిని ఎంపిక చేయాలి
రైతుబజార్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
పాడేరు, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయాధారిత ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్‌లు నెలకొల్పడానికి ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో పరిశ్రమల పార్కులు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటుపై వ్యవసాయానుబంధ రంగాల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించిన ఒకరోజు వర్కుషాప్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న పాడేరు, రంపచోడవరం, చింతూరు మూడు ఐటీడీఏల పరిధిలో ఆహార శుద్ధి, పౌల్ర్టీ, తేనె పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే అవసరమైన చోట్ల రైతుబజార్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. తేనె పరిశ్రమలు నెలకొల్పడానికి 100 మందిని గుర్తించాలని, ముందుకు వచ్చే వారికి తగిన శిక్షణ అందిస్తామన్నారు. అలాగే ప్రాజెక్టుల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అలాగే గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధికి పరిశ్రమల పార్కులు దోహదపడతాయన్నారు. అలాగే గిరిజన రైతులు పండిస్తున్న ఆర్గానిక్ కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం వంటి పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. పరిశ్రమలు పెట్టే వారికి బ్యాంకు రుణాలు, పెట్టుబడులు ప్రభుత్వ శాఖల సహకారం ఏవిధంగా తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. అలాగే ఎక్కడ పరిశ్రమల పార్కులు పెడితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందో అధికారులు, రైతు సంఘాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పుట్ట గొడుగుల పెంపకానికి అనుకూల వాతావరణం ఇక్కడ ఉందని, ఆ దిశగా రైతులను ప్రొత్సహిస్తే పెద్ద ఎత్తున సాగు చేయవచ్చునని కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, కట్టా సింహాచలం, అపూర్వ భరత్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నంద్ (వర్చువల్‌గా), జిల్లా పరిశ్రమల అధికారి జి.రవిశంకర్, పశుసంవర్థక శాఖ డీడీ సీహెచ్.నరసింహులు, జిల్లా సెరికల్చర్ అధికారి అప్పారావు, స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డు ఆఫీసర్ బి.కల్యాణి, ఎల్‌డీఎం మాతునాయుడు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.