Share News

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:37 PM

రైతులు అధిక దిగుబడులు సాధించేలా సేంద్రీయ వ్యవసాయాన్ని సంపూర్ణంగా ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): రైతులు అధిక దిగుబడులు సాధించేలా సేంద్రీయ వ్యవసాయాన్ని సంపూర్ణంగా ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక, పట్టుపరిశ్రమ, మైక్రో ఇరిగేషన్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో వ్యవసాయానుబంధ రంగాలకు చెందిన అధికారులు సంయుక్తంగా సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రబీ, ఖరీఫ్‌ సీజన్లలో ఎన్ని ఎకరాల్లో ఆర్గానిక్‌ సాగు చేస్తున్నారని వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉత్పత్తి పెరుగుతున్న వ్యవసాయ పంటలను గుర్తించి వాటిని రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. జీవామృతం, ఘనామృతం వంటి ఆర్గానిక్‌ ఎరువులు ఎంత మేరకు అవసరం ఉంటుందో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రానున్న ఏడాదిలో రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని నిర్మూలించాలని, ఖరీఫ్‌లో రైతులకు సరఫరా చేయాల్సిన విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. కాఫీ, మిరియాలు పంటకోత అనంతరం చేయాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాఫీ రైతులకు అవసరమైన బేబీ పల్పర్లు, టార్పాలిన్లు, నిచ్చెనలు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫారాల గురించి కలెక్టర్‌ ఆరా తీశారు. కూరగాయల పెంపకాన్ని విస్తరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో పైనాపిల్‌ పంటలు, చింతూరు డివిజన్‌లో మల్బరీ సాగును విస్తరించాలన్నారు. రీలింగ్‌ యూనిట్‌ నెలకొల్పడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నంద్‌, జిల్లా ఉద్యానవనాధికారి ఎ.రమేశ్‌ కుమార్‌రావు, పశుసంవర్థక శాఖ డీడీ నరసింహులు, జిల్లా సెరీకల్చర్‌ అధికారి అప్పారావు, డ్వామా పీడీ విద్యాసాగర్‌, మైక్రో ఇరిగేషన్‌ పీడీ రహీమ్‌, ఎస్‌ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు, జిల్లాలో 22 మండలాలకు చెందిన ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:37 PM