ప్రగతి పరుగులు
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:59 PM
విశాఖపట్నం 2025లో ప్రగతి పథాన పరుగులు తీసింది.
నగరానికి దిగ్గజ ఐటీ కంపెనీలు
కాగ్నిజెంట్ ఇప్పటికే ప్రారంభం, త్వరలో టీసీఎస్ రాక
డేటా సెంటర్ల హబ్‌గా విశాఖ
‘గూగుల్’కు భూ కేటాయింపు
రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం ప్రారంభం
యోగాంధ్రాతో ప్రపంచ రికార్డు
స్టీల్ ప్లాంటుకు ఊపిరి
కేంద్రం రూ.11,440 ప్రత్యేక ప్యాకేజీ
భారీగా పెట్టుబడిదారుల సదస్సు
పర్యాటక రంగంలో కొత్త ఆకర్షణలు...
స్కై సైక్లింగ్.. గ్లాస్ బ్రిడ్జి.. సీ హ్యారియర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మాధవ్
2025 రౌండప్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం 2025లో ప్రగతి పథాన పరుగులు తీసింది. రూ.1.35 లక్షల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుచేయనున్నట్టు గూగుల్ చేసిన ప్రకటనతో విశాఖ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అదేవిధంగా లక్షలాది మందితో సాగర తీరాన నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అంపశయ్యపైకి చేరిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీతో ఊపిరిపోసింది. పర్యాటక రంగంలో కొత్త ప్రాజెక్టులతో విశాఖపట్నం అందరినీ రారమ్మని ఆహ్వానిస్తోంది. కాగ్నిజెంట్ వంటి భారీ సంస్థ శంకుస్థాపన చేసుకోవడంతో యువతకు ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురించాయి.
రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన విశాఖపట్నం రైల్వే జోన్‌కు అవసరమైన కార్యాలయం నిర్మాణానికి ఈ ఏడాది మొదట్లోనే ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ముడసర్లోవలో భూమి కేటాయింపునకు వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయగా కూటమి ప్రభుత్వం దానికి మార్గం సుగమం చేసింది. అదే వేదికపై నుంచి ప్రధాని మోదీ సబ్బవరం-షీలానగర్ ఆరు వరుసల రహదారికి శంకుస్థాపన చేశారు.
11వ అంతరాత్జీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. విశాఖ నుంచి భీమిలి వరకు ఒకే మార్గంలో 3 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు హాజరయ్యారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నష్టాల్లోకి వెళ్లి ముడి పదార్థాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉంటే కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో ఊపిరిపోసింది.
పర్యాటకంలో విశాఖపట్నం కొత్త పుంతలు తొక్కుతోంది. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఈ ఏడాదిలోనే బీచ్‌రోడ్డులో యుహెచ్-3హెచ్ హెలికాప్టర్ మ్యూజియం అందుబాటులోకి తీసుకువచ్చింది. కైలాసగిరిపై దేశంలోనే అతి పెద్దదైన గ్లాస్ బ్రిడ్జిని నిర్మించి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదే కైలాసగిరిపై స్కై సైక్లింగ్, జిప్‌లైన్ వంటివి కూడా ప్రారంభించింది.
ఉత్సవంలో అపశ్రుతి
ఏప్రిల్ నెలాఖరున జరిగిన సింహాచలం చందనోత్సవంలో ఈ ఏడాది ఊహించని ప్రమాదం జరిగింది. జోడు భద్రాల వద్ద తాత్కాలికంగా నిర్మించిన గోడ గాలివానకు కూలిపోవడంతో అక్కడ క్యూలో ఉన్న ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఉన్నత స్థాయి విచారణ చేపట్టి బాధ్యులైన ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేసింది.
ఐటీలో పెట్టుబడులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఐటీ పాలసీ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. భారీగా ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం ఎకరా భూమి 99 పైసలకే ఇస్తోంది. టీసీఎస్‌కు కాపులుప్పాడలో 21.6 ఎకరాల భూమితో పాటు రుషికొండ ఐటీ హిల్స్‌లోని మిలీనియం టవర్-బిని తక్షణ కార్యకలాపాల కోసం కేటాయించింది. ఈ సంస్థ రూ.1,370 కోట్ల పెట్టుబడులు పెట్టి దశల వారీగా 13 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీని కంటే ముందే కాగ్నిజెంట్ హిల్-2పై ఆపరేషన్లకు శ్రీకారం చుట్టింది. వీరికి శాశ్వత క్యాంపస్ కోసం కాపులుప్పాడలో 21.31 ఎకరాలు ఇవ్వగా, రూ.1,582.98 కోట్లు పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసింది. దశల వారీగా 25 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌తో కలిసి ఇటీవల శంకుస్థాపన చేశారు. అదేరోజు మరో ఎనిమిది ఐటీ కంపెనీల నిర్మాణానికి ఐటీ మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. సిఫీ డేటా సెంటర్‌కు కూడా శంకుస్థాపన జరిగింది. గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాలు కేటాయించారు. హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని గూగుల్ ప్రకటించింది. భోగాపురంలో అంతర్జాతీయ ఎడ్యుసిటీకి కూడా ఈ ఏడాదిలోనే అడుగులు పడ్డాయి. జీఎంఆర్-మాన్సాస్ ట్రస్ట్‌ల మధ్య ఎంఓయూ జరిగింది.
దూసుకువెళుతున్న షిప్‌యార్డు
హిందూస్థాన్ షిప్‌యార్డ్ లాభాల బాటలో దూసుకువెళుతోంది. నేవీ కోసం రెండు యుద్ధనౌకలు నిస్తార్, నిపుణ్‌ల నిర్మాణం పూర్తి చేసి ఈ ఏడాదిలోనే అప్పగించింది. విశాఖపట్నం పోర్టుకు రెండు బొల్డార్ పుల్ టగ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నగరవాసి మాధవ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా విశాఖపట్నం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పగ్గాలు అందుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా రాజశేఖర్, వాల్తేరు డీఆర్‌ఎంగా లలిత్ బొహ్రాలు బాధ్యతలు చేపట్టారు. తూర్పు నౌకాదళం చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా వచ్చారు. జీవీఎంసీ కమిషనర్‌గా కేతన్ గార్గ్, వీఎంఆర్‌డీఏ మెట్రో పాలిటన్ కమిషనర్‌గా తేజ్ భరత్ ఈ ఏడాదే విశాఖలో బాధ్యతలు తీసుకున్నారు.
అంచనాకు మించి పెట్టుబడులు
విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజులు సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ఊహించిన దాని కంటే అధికంగా పెట్టుబడులు వచ్చాయి. రూ.పది లక్షల కోట్లు వస్తాయని అంచనా వస్తే రూ.13.25 లక్షల కోట్లు వచ్చాయి. ఐటీ, ఇంధన, తయారీ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి.