లాభం.. అంతంతమాత్రం!
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:33 AM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అమలుచేసిన జీఎస్టీ నూతన శ్లాబుల విధానం జిల్లాలో తొలిరోజు పూర్తి స్థాయిలో అమలు కాలేదు.
జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుకాని జీఎస్టీ కొత్త శ్లాబులు
కేంద్రం ఆదేశించినా పట్టించుకోని వ్యాపారులు
పాత ధరలనే వసూలు చేసిన వైనం
నిత్యావసర సరకుల ధరల్లో ఎటువంటి మార్పూ లేదు
గగ్గోలు పెడుతున్న వినియోగదారులు
ఎలక్ర్టికల్ వస్తువులు, ఫుట్‌వేర్, కార్లు, బైకుల రేట్లు మాత్రం తగ్గింపు
అనకాపల్లి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అమలుచేసిన జీఎస్టీ నూతన శ్లాబుల విధానం జిల్లాలో తొలిరోజు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇప్పటివరకు అమల్లో ఉన్న 5, 12, 18, 28 శాతం శ్లాబుల స్థానంలో, కేవలం 5, 18 శాతం శ్లాబులను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నుంచి కొత్త శ్లాబులను అనుసరించి విక్రయాలు సాగించాలని ఆదేశించింది. అయితే జిల్లాలో అనేక వస్తువుల ధరలను తగ్గించేందుకు వ్యాపారులు ఇష్టపడలేదు.
ముఖ్యంగా నిత్యావసర సరకులు, మందులు, ఫుట్‌వేర్, వస్ర్తాలపై నూతన జీఎస్టీని అనుసరించి ధరలను తగ్గించాల్సి ఉండగా, వ్యాపారులు పట్టనట్టు వ్యవహరించారు. వినియోగదారులు ప్రశ్నిస్తే పూర్తిస్థాయిలో సమాచారం రాలేదని వాదిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే తాము జీఎస్టీ చెల్లించి కొనుగోలు చేసిన సరకులను తగ్గించి అమ్మడం సాధ్యం కాదంటున్నారు. కాగా ఎలక్ర్టికల్ వస్తువులు, కార్లు, బైక్‌లపై తగ్గిన శ్లాబులు అమల్లోకి వచ్చాయి. వాటికి దసరా ఆఫర్లు తోడవడంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడ్డారు.
తగ్గాల్సిన వస్తువులు ఇవే..
మిల్క్, చీజ్, పిజ్జా, బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటీ, కొన్ని రకాల మందులు, నోట్‌బుక్స్ ఎక్సర్‌సైజ్ బుక్స్, పెన్సిల్స్, షార్ప్‌నర్స్, క్రయాన్స్ వంటివి 12 శాతం శ్లాబు నుంచి జీరో శ్లాబులోకి మార్చారు. అంటే వీటిపై జీఎస్టీ వసూలు చేయకూడదు. అలాగే కండెన్స్‌డ్ మిల్క్, బటర్, నెయ్యి, చీజ్, రూ.2,500 కంటే తక్కువ ధర గల ఫుట్‌వేర్, వస్ర్తాలు, కాటన్, జ్యూట్ హ్యాండ్‌బ్యాగ్స్, కొన్ని రకాల ఫర్నిచర్, కిరోసిస్‌స్టవ్, లాంతర్లు, డ్రై ఫూట్స్, డయాబెటిక్ ఫుడ్స్, వ్యవసాయ యంత్రాలు, సౌరశక్తి పరికరాలు 12 శాతం నుంచి ఐదు శాతం శ్లాబ్‌లోకి మార్చారు. టాల్కమ్ ఫౌడర్, షాంపూ, హెయిర్‌ఆయిల్, టూత్‌పేస్ట్, చాక్లెట్స్, కేక్, బిస్కెట్స్, కాఫీ, టీ ఎక్స్‌ట్రాక్ట్స్, ఐస్‌క్రీమ్, మినరల్ వాటర్ కూడా ఐదు శాతం శ్లాబులోకి వచ్చాయి. ఎయిర్ కండిషన్లు, డిష్, వాషింగ్ మెషీన్లు, 1200 సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం గల పెట్రోల్, 1500 సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం గల డీజిల్ వాహనాలు 28 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ శ్లాబులోకి మారాయి.
తగ్గింపు వీటికే పరిమితం..
తగ్గిన జీఎస్టీ శ్లాబులను జిల్లాలో కొన్నిచోట్ల మాత్రమే అమలుచేశారు. మిల్క్, చీజ్, నెయ్యిలపై తగ్గింపు ధరలు అందుబాటులోకి వచ్చాయి. లీటరు పాల ప్యాకెట్‌పై రూ.3 వరకు తగ్గగా, 500 గ్రాముల నెయ్యిని కంపెనీని బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించారు. పన్నీర్ ధర కిలోకు రూ.20నుంచి రూ.25 వరకు తగ్గింది. మిల్క్‌షేక్‌లు, ఫ్లమ్ కేక్స్‌పై రెండు నుంచి ఐదు రూపాయల వరకు తగ్గింది. కాగా మరికొన్ని కంపెనీలు పాత ధరలకే విక్రయిస్తున్నాయి. 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో కార్లు, బైక్‌ల ధరలు దిగి వచ్చాయి. కంపెనీ ధరను బట్టి కనిష్ఠంగా రూ.ఆరు వేల నుంచి రూ.15 వేలు వరకు తగ్గింది. కార్ల ఽధరలు భారీగా తగ్గాయి. ఒక్కో కారుపై రూ.60 వేల నుంచి రూ.1.10 లక్షల వరకు తగ్గినట్టు షోరూమ్ యజమానులు చెబుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా రేట్లు తగ్గించాయి. ఇద్దరు పిల్లలున్న కుటుంబానికి (వయసును బట్టి) రూ.10 లక్షల పాలసీకి ఇప్పటివరకు రూ.24 వేల నుంచి రూ.28 వేల వరకు వసూలు చేస్తుండగా, దీనిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడంతో రూ.19 వేల నుంచి రూ.20 వేల మధ్య అందుబాటులోకి వచ్చాయి. ఇక ఏసీ, డిష్ వాషర్, టీవీలు 28 శాతం నుంచి 18 శాతం శ్లాబుల్లోకి మార్చడంతో ధరలు తగ్గియి. సామర్థ్యాన్ని బట్టి ఏసీపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు, డిష్ వాషర్‌పై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు, టీవీలపై రూ.4 వేల నుంచి రూ.పది వేలు తగ్గించి విక్రయిస్తున్నారు.
తగ్గని వస్తువులు ఇవే..
జీఎస్టీ శ్లాబులు మేరకు ధరలను తగ్గించి విక్రయించాలని కేంద్రం ఆదేశించినప్పటికీ అనేక మంది వ్యాపారులు పట్టించుకోలేదు. టాల్కమ్ ఫౌడర్, షాంపూ, హెయిర్‌ఆయిల్, టూత్‌పేస్ట్, చాక్లెట్స్, కేక్, బిస్కెట్స్, కాఫీ, టీ ఎక్స్‌ట్రాక్ట్స్, ఐస్‌క్రీమ్, మినరల్ వాటర్ ధరలు తగ్గలేదు. వస్ర్తాలు, ఫుట్‌వేర్‌లకు పాత ధరలే వసూలు చేశారు. జిల్లాలో 850 కిపైగా మెడికల్ స్టోర్స్ ఉండగా తగ్గింపు ధరలకు అమ్మకాలు సోమవారం ప్రారంభం కాలేదు. అయితే బిల్లులో తగ్గిన జీఎస్టీలను చూపిస్తూ డిస్కౌంట్ రేట్లను పెంచి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా తాము ఇప్పటికే జీఎస్టీ చెల్లించి సరకులు కొనుగోలు చేశామని, వాటిని తగ్గించి విక్రయిస్తే నష్టపోతామని కొందరు వ్యాపారులు వినియోగదారులతో వాదనకు దిగుతున్నారు.
కిరాణా సామగ్రిపై కానరాని జీఎస్టీ తగ్గింపు ప్రభావం
నర్సీపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ 2.0 సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ నర్సీపట్నంలో కిరాణా సామగ్రి ధరలు ఇసుమంతైనా తగ్గలేదు. ఇప్పటి వరకు ఐదు శాతం శ్లాబ్‌లో వున్న కిరాణా సామగ్రిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ ఒక్క సరకు ధర తగ్గలేదని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. ఆయా సామగ్రిని ఆదివారం వ్యాపారులు ఏ ధరలకు విక్రయించారో, సోమవారం కూడా అవే ధరలకు విక్రయించారు. వంట నూనె లీటర్ ప్యాకెట్ (ఫ్రీడమ్) రూ.150, కంది పప్పు రూ.105, పెసర పప్పు 110, మినపప్పు రూ.150, వేయించిన శనగపప్పు రూ.140, గోధుమ పిండి (బ్రాండెడ్) రూ.63, పంచదార రూ.48, బెల్లం రూ.50, బియ్యం బస్తా (26 కిలోలు) రూ.1,425 ఉన్నాయి. ఆది, సోమవారాల్లో వీటి ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదని వినియోగదారులు పేర్కొన్నారు. ప్యాకెట్ పాలు మినహా మిగిలిన నిత్యావసర ధరలు యథావిధిగా వున్నాయని చెబుతున్నారు.