ఏయూ రిజిస్ర్టార్‌గా ప్రొఫెసర్ కె.రాంబాబు
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:21 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన రిజిస్ర్టార్‌గా సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్, ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్‌గా సేవలందిస్తున్న ప్రొఫెసర్ కె.రాంబాబును నియమిస్తున్నట్టు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రకటించారు.
ఏయూ రిజిస్ర్టార్‌గా ప్రొఫెసర్ కె.రాంబాబు
విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన రిజిస్ర్టార్‌గా సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్, ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్‌గా సేవలందిస్తున్న ప్రొఫెసర్ కె.రాంబాబును నియమిస్తున్నట్టు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రకటించారు. ప్రొఫెసర్ ధనుంజయరావు స్థానంలో ప్రొఫెసర్ రాంబాబును నియమించినట్టు పేర్కొన్నారు. ప్రొఫెసర్ రాంబాబుకు నియామక ఉత్తర్వులను వీసీ రాజశేఖర్ అందజేశారు. అనంతరం బాధ్యతలను స్వీకరించిన ప్రొఫెసర్ రాంబాబు మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలను అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువరు అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ కిశోర్‌బాబు, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎంవీఆర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
నేడు సీఎం రాక
విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 1.45 గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో గల కోస్టల్ బ్యాటరీ వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. అక్కడ నుంచి నోవాటెల్ హోటల్‌కు వెళ్లి ఈస్ట్‌కోస్ట్ మారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు నోవాటెల్ నుంచి బయలుదేరి కోస్టల్ బ్యాటరీ వద్ద గల హెలిప్యాడ్‌కు చేరుకుని 4.30 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లికి బయలుదేరతారు.
నేడు రెండో దఫా డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
విమల విద్యాలయంలో ఏర్పాట్లు
విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
డీఎస్సీ మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులల్లో మరికొందరి సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం ఉక్కునగరంలోని విమల విద్యాలయంలో చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ నుంచి జిల్లా విద్యా శాఖకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉక్కునగరంలోని విమల విద్యాలయంలో ఆరు కౌంటర్లు ఏర్పాటుచేసింది. ప్రతి కౌంటర్‌లో 50 మంది చొప్పున సుమారు 300 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావలసిన అభ్యర్థులకు కాల్‌లెటర్లు సోమవారం రాత్రికి అందే అవకాశం ఉంది.
డీఎస్సీ మెరిట్ జాబితా మేరకు ఉమ్మడి జిల్లాలో 1,139 పోస్టులకుగాను 1,138 మంది అభ్యర్థులు, జోన్-1లో 304 పోస్టులకు 304 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన గత నెల 25వ తేదీ నుంచి మూడురోజులపాటు విమల విద్యాలయంలో నిర్వహించారు. అయితే కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికయ్యారు. దరఖాస్తు చేసుకునే సమయంలోనే పోస్టులకు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైతే...దరఖాస్తులో ఇచ్చిన ఆప్షన్ మేరకు ఒక పోస్టును ఎంపిక చేసుకోవాలి. తొలివిడత సర్టిఫికెట్ల పరిశీలనలో అటువంటి అభ్యర్థులు ఒక పోస్టు ఎంపిక చేసుకున్న తరువాత మిగిలిన పోస్టుల కోసం అభ్యర్థుల ఎంపికకు తాజాగా సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. కాగా మంగళవారం ఉక్కునగరంలోని విమల విద్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లుచేశామని డీఈవో నిమ్మక ప్రేమ్‌కుమార్ తెలిపారు.
4న స్టాండింగ్ కమిటీ సమావేశం
200 అంశాలతో అజెండా
విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
కొత్తగా ఎన్నికైన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ తొలి సమావేశం ఈనెల నాలుగున నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి గతనెల ఆరున ఎన్నికలు జరగ్గా, కూటమి నుంచి తొమ్మిది మంది, వైసీపీ నుంచి ఒకరు గెలుపొందిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన కమిటీ తొలి సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు పాత కౌన్సిల్‌హాల్‌లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు 200 అంశాలతో అజెండాను తయారుచేశారు. నగర పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, ఉద్యోగుల జీతభత్యాలు, పదోన్నతులు, మార్కెట్‌లు, దుకాణాల వేలానికి సంబంధించిన అంశాలను అజెండాలో పొందుపరిచినట్టు సమాచారం.