లక్ష్యానికి దూరంగా క్కు ఉత్పత్తి
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:17 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఉత్పత్తి పెరిగిందని చెప్పుకోవడానికి నానాతంటాలు పడుతోంది.
తప్పిన లెక్కలు, అయినా యాజమాన్యం గొప్పలు
92 శాతం ఉత్పత్తి సాధిస్తామంటూ సీఎంకు హామీ
అక్టోబరు నెలలో వచ్చింది 74 శాతమే...
ఆ విషయం మరుగుపరచేందుకు తిప్పలు
గత ఏడాది అక్టోబరు నెలతో పోలిక
అప్పటి పరిస్థితులు వేరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఉత్పత్తి పెరిగిందని చెప్పుకోవడానికి నానాతంటాలు పడుతోంది. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన యాజమాన్య ప్రతినిధులు 92 శాతం ఉత్పత్తి సాధిస్తామని హామీ ఇచ్చారు. అదే విషయం ఇక్కడకు వచ్చి ఉద్యోగులు, కార్మికులకు చెప్పి, అంతా కలిసి పని చేద్దామని, లక్ష్యం సాధిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. ఇప్పుడు అక్టోబరు నెలలో చూస్తే ఒక్కరోజు కూడా 92 శాతం ఉత్పత్తి సాధించలేదు. మొత్తంగా చూసుకుంటే మూడు బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)ల ద్వారా 74 శాతమే ఉత్పత్తి తీశారు. అయితే, ఇది గత ఏడాది అక్టోబరు నెలతో పోల్చితే అధికమని, ప్లాంటును ముందుకు తీసుకువెళుతున్నామని గొప్పలు చెబుతున్నారు.
గత ఏడాది (2024) అక్టోబరు పరిస్థితి పూర్తిగా వేరు. అప్పుడు ముడి పదార్థాలకు నిధులు లేవు. కర్మాగారం ఆర్థిక సమస్యలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దాంతో ఉత్పత్తి బాగా పడిపోయింది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ సమకూర్చాయి. దాంతో పూర్తి ఉత్పత్తి సాధించాల్సి ఉంది. కానీ అది చూపించలేక గత ఏడాది ఉత్పత్తితో ఈ అక్టోబరు ఉత్పత్తిని పోల్చి వృద్ధి రేటు నమోదు చేశామని చెప్పుకుంటోంది.
ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా రోజుకు 21 వేల నుంచి 22 వేల టన్నుల హాట్ మెటల్ తీయవచ్చు. అయితే సమస్యలు ఉన్నాయి కాబట్టి అంత చేయలేమని రోజుకు 19 వేలు టన్నులు చొప్పున 92 శాతం సగటు ఉత్పత్తి తీస్తామని యాజమాన్యం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ముడి పదార్థాల సరఫరా పెంచి, అవసరమైన సంఖ్యలో కార్మికులను అందుబాటులో ఉంచాలి. కానీ వాటిని యాజమాన్యం విస్మరించింది. రెండో విడత వీఆర్‌ఎస్ ఇచ్చి 470 అధికారులను ఇంటికి పంపింది. మరో 550 మంది కాంట్రాక్టు వర్కర్లను తొలగించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ), కోక్ ఓవెన్, సింటర్ ప్లాంటులో ఇబ్బందులు ఉన్నాయి. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. దాంతో ఉత్పత్తి ఆశించిన విధంగా రాలేదు. అక్టోబరు నెలలో ఒక్కరోజు కూడా 19 వేల టన్నులు ఉత్పత్తి చేయలేకపోయారు. సగటున రోజుకు ఉత్పత్తి 16,336 టన్నులు మాత్రమే వచ్చింది.
- బ్లాస్ట్ ఫర్నేస్-1లో రోజుకు సగటున 5,135 టన్నుల చొప్పున అక్టోబరులో 1,59,171 టన్నుల హాట్ మెటల్ వచ్చింది.
- బ్లాస్ట్ ఫర్నేస్-2లో రోజుకు 4,214 టన్నుల చొప్పున 1,30,629 టన్నుల ఉత్పత్తి వచ్చింది.
- బ్లాస్ట్ ఫర్నేస్-3లో రోజుకు 6,988 టన్నుల చొప్పున 2,16,627 టన్నుల ఉత్పత్తి తీశారు. దీని ద్వారా రోజుకు ఎనిమిది వేల టన్నుల ఉత్పత్తి తీసే అవకాశం ఉంది. కానీ సాధించలేకపోయారు.
మొత్తంగా చూసుకుంటే మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా 5,06,427 టన్నుల హాట్ మెటల్ వచ్చింది. ఇది 74 శాతం మాత్రమే. అయితే గత ఏడాది అక్టోబరులో 66 శాతమే ఉత్పత్తి చేశామని, దానికంటే ఇప్పుడు 8 శాతం ఎక్కువ సాధించామని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం 92 శాతం చేస్తామని హామీ ఇచ్చి దానికంటే 18 శాతం వెనుకపడ్డామనే విషయం మరుగున పెడుతున్నారు. యాజమాన్య ప్రతినిధుల్లో కొందరికి వచ్చే నెలతో పదవీకాలం పూర్తవుతుంది. మరో ఆరు నెలలు కొనసాగడానికి ఇలా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి.