Share News

గర్భిణుల వసతి గృహంలో గంపెడు సమస్యలు

ABN , Publish Date - May 24 , 2025 | 11:19 PM

చింతపల్లి వసతి గృహం మరమ్మతులకు గురికావడంతో గర్భిణులు అవస్థలు పడుతున్నారు. వసతి గృహం పైకప్పు రేకులు పగిలిపోయి, రంధ్రాలు ఏర్పడ్డాయి. వర్షం వస్తే భవనం కారిపోతున్నది. గత వైసీపీ ప్రభుత్వం గర్భిణుల వసతి గృహం నిర్వహణను కనీసం పట్టించుకోలేదు. దీంతో పైకప్పు పూర్తిగా పాడైపోయింది. ప్రస్తుతం అసౌకర్యాల నడుమ గర్భిణులు ప్రసవాల కోసం నిరీక్షిస్తున్నారు.

గర్భిణుల వసతి గృహంలో  గంపెడు సమస్యలు
గర్భిణుల వసతి గృహం

వర్షానికి కారిపోతున్న పైకప్పు

పనిచేయని ఆర్వో ప్లాంట్‌

చాలిచాలని మరుగుదొడ్లు

మరమ్మతులకు గురైన ఫ్యాన్లు

అవస్థలు పడుతున్న గర్భిణులు

చింతపల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో శివారు గ్రామాలకు పూర్తి స్థాయిలో రహదారుల సదుపాయం లేదు. దీంతో నెలలు నిండిన గర్భిణులనులకు పురిటినొప్పులు ప్రారంభమైతే అతికష్టంపై ఆదివాసీలు డోలిపై ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో ప్రసవం కావడం, సకాలంలో మెరుగైన వైద్యం అందక మాత, శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యను అదిగమించేందుకు 2018లో తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో గర్భిణుల వసతి గృహాలను ఏర్పాటు చేసింది. గర్భిణులు ప్రసవానికి 10, 15 రోజుల ముందు వసతి గృహాల్లో చేరితే పురిటి నొప్పులు వచ్చే వరకు నిరీక్షించవచ్చు. పురిటినొప్పులు ప్రారంభంకాగానే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు అనువుగా ఉంటుందని గర్భిణుల వసతి గృహాల నిర్మాణాలకు టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రతిపాదన మరుగునపడిపోయింది. అయితే 2021లో నాటి పాడేరు ఐటీడీఏ పీవో రోణంగి గోపాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చింతపల్లిలో గర్భిణుల వసతి గృహం నిర్మాణానికి రూ.7.5లక్షలు మంజూరు చేశారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు సంతబయలులోనున్న కల్యాణ మండపాన్ని ఆధునీకరించారు. గర్భిణులు బస చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. అదే ఏడాది సెప్టెంబరు నుంచి ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణలో గర్భిణుల వసతి గృహం నడుస్తున్నది. ప్రస్తుతం వసతి గృహంలో ప్రతి రోజు 10 నుంచి 15మంది గర్భిణులు బస చేస్తున్నారు. ముగ్గురు స్టాఫ్‌ నర్సులు మూడు షిఫ్ట్‌ల్లో సేవలందిస్తున్నారు. గర్భిణులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నారు. పురిటి నొప్పులు రాగానే ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంటుంది.

నిర్వహణ పట్టించుకోని గత ప్రభుత్వం

చింతపల్లి గర్భిణుల వసతి గృహం నిర్వహణను వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా కనీసం పట్టించుకోలేదు. దీంతో గర్భిణులు సమస్యలతో సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం గర్భిణుల వసతి గృహం పైకప్పు పూర్తిగా పాడైపోయింది. పలు చోట్ల రేకులు పగిలిపోవడంతోపాటు భారీ రంధ్రాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వసతి గృహం కారిపోతున్నది. దీంతో గర్భిణులు భవనంలోని ఓ మూలకు బెడ్స్‌ జరుపుకుని పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వర్షపు నీరు భవనంలో లోపలకు వస్తుండడంతో గర్భిణులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మూడు నెలల క్రితం భవనం వర్షానికి కారిపోతున్నందున రేకులపైన టార్పాలిన్‌ ఏర్పాటు చేశారు. దీంతో చిన్నపాటి వర్షాలకు వర్షపు నీరు లోపలికి రావడంలేదు. అయితే భారీ వర్షం కురిస్తే భవనం కారిపోతున్నది. భవనం పైకప్పు రేకులు పూర్తిగా మార్చి, మరమ్మతులు చేపడితేనే తప్ప ఈసమస్యకు పరిష్కారం లభించే అవకాశంలేదు.

మూలన పడిన ఆర్వో ప్లాంట్‌

గర్భిణుల వసతి గృహంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ నిరుపయోగంగా మూలన పడింది. ఆర్వో ప్లాంట్‌ నిర్మించిన ఆరు నెలలకే మరమ్మతులకు గురైంది. నాటి నుంచి మరమ్మతులు చేపట్టకపోవడంతో గర్భణులకు రక్షిత మంచి నీరు అందుబాటు లేదు. భోజన కాంట్రాక్టర్‌ నీళ్ల ట్యాంక్‌తో మంచి నీటి సరఫరా చేస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలాల్లో గర్భిణులు వాటర్‌ బాటిల్‌ కొనుక్కోవాల్సి వస్తున్నది.

రెండే మరుగుదొడ్లు

వసతి గృహంలో కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. గర్భిణులు, సహాయకులు మరుగుదొడ్లు సరిపడడంలేదు. గర్భిణులు, సహాయకులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, మల,మూత్ర విసర్జనకు అవస్థలు పడుతున్నారు. దీంతో వసతి గృహంలో అదనపు మరుగుదొడ్లు నిర్మించాలని గర్భిణులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఫ్యాన్లు పనిచేయడం లేదు. వాటిని మరమ్మతులు చేసే వారే కరువయ్యారని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడైన ఫ్యాన్లను మరమ్మతులు చేయించాలని, లేకుంటే కొత్తవి ఏర్పాటు చేయాలని గర్భిణులు కోరుతున్నారు.

Updated Date - May 24 , 2025 | 11:19 PM