ఉక్కులో ప్రైవేటు క్యాంటీన్లు మూసివేత!
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:35 AM
స్టీల్ ప్లాంటులో కార్మికుల కోసం నిర్వహిస్తున్న 210 ప్రైవేటు క్యాంటీన్లను బుధవారం యాజమాన్యం పూర్తిగా మూసివేయించింది. దాంతో అక్కడ పనిచేసే వేలాది మందికి తాగడానికి టీ, తినడానికి టిఫిన్ కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరి నిర్ణయమో..ఎందుకు ఇలా కార్మికులను వేధిస్తున్నారో అర్థం కావడం లేదని నాయకులు వాపోతున్నారు.
యాజమాన్యం వివాదాస్పద నిర్ణయం
దశాబ్దాల కిందట ఏర్పాటు
విద్యుత్, నీరు ఉచితంగా ఉపయోగించుకుంటున్నాయని ఇప్పుడు క్లోజ్
నేటి నుంచి కార్మికులు టీ తాగాలన్నా కష్టమే
పరిమిత సంఖ్యలోనే అధికారిక క్యాంటీన్లు
అక్కడకు వెళ్లిరావాలంటే అరగంటకుపైగా సమయం పట్టే అవకాశం
ప్రస్తుత తరుణంలో విభాగాధిపతులు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదనే వాదన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటులో కార్మికుల కోసం నిర్వహిస్తున్న 210 ప్రైవేటు క్యాంటీన్లను బుధవారం యాజమాన్యం పూర్తిగా మూసివేయించింది. దాంతో అక్కడ పనిచేసే వేలాది మందికి తాగడానికి టీ, తినడానికి టిఫిన్ కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరి నిర్ణయమో..ఎందుకు ఇలా కార్మికులను వేధిస్తున్నారో అర్థం కావడం లేదని నాయకులు వాపోతున్నారు.
స్టీల్ ప్లాంటు 20 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. మొత్తం 72 విభాగాలు ఉన్నాయి. ఇది అతి పెద్ద పరిశ్రమ కావడంతో విభాగాలన్నీ ఒక దానికి మరొకటి సంబంధం లేకుండా దూరంగా ఉంటాయి. ఒక విభాగం కార్మికులు మరో విభాగానికి ఏదైనా పనిపై వెళ్లాలంటే కనీసం కిలోమీటరు దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అధికారికంగా ఉద్యోగుల కోసం స్టీల్‌ప్లాంటు ఏర్పాటుచేసిన క్యాంటీన్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. రెండు, మూడు గంటలు పనిచేశాక అలసిపోయి టీ లేదా కాఫీ తాగాలని లేదా ఆకలైతే ఏదైనా తినాలని అనుకుంటారు. అటువంటి వారి కోసం కొన్ని దశాబ్దాల క్రితం ఆయా విభాగాధిపతుల సిఫారసుతో ప్రైవేటు క్యాంటీన్లు ఏర్పాటుచేశారు. ఒక్కొక్కరికి 50 నుంచి 70 గజాల స్థలం కేటాయించగా అందులో టీ దుకాణాలు, టిఫెన్ సెంటర్లు, జ్యూస్ స్టాల్స్ పెట్టుకొని నడుపుతున్నారు. వాటిలో ఒక్కో దాంట్లో నలుగురైదుగురు ఉపాధి పొందుతున్నారు. అయితే ఆ క్యాంటీన్లు స్టీల్ ప్లాంటు భూమిని ఉచితంగా ఉపయోగించుకుంటున్నాయని, విద్యుత్, నీరు కూడా వాడుకుంటున్నాయని, అందువల్ల తక్షణమే వాటిని మూసేయాలంటూ ఈ నెల మొదటి వారంలో అందరికీ యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. దీనిపై కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యంతో చర్చించేందుకు ప్రయత్నం చేశారు. ఆయా క్యాంటీన్లు వల్ల కార్మికులకు ఉపయోగం ఉందని, వాటిని తీసేస్తే వారంతా ఇబ్బంది పడతారని చెప్పాలని యత్నించారు. కానీ యాజమాన్యం అవకాశం ఇవ్వలేదు. మొత్తం క్యాంటీన్లన్నీ బుధవారం పూర్తిగా మూయించేసింది. వాటిలో పనిచేసే వారికి ఇచ్చే గేట్‌పాస్‌లను మంగళవారం సాయంత్రమే రద్దు చేసింది. అంటే ఆయా పనివారు ఇప్పుడు ప్లాంటులోకి వచ్చే అవకాశం లేకుండా చేసింది. పోనీ ప్రత్యామ్నాయంగా కార్మికుల కోసం ఏమైనా ఏర్పాటుచేసిందా? అంటే అదీ లేదు.
అధికారిక క్యాంటీన్లు అక్కడక్కడా ఉన్నా అంత దూరం వెళ్లి రావడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ప్రస్తుతం పూర్తిస్థాయి ఉత్పత్తి పేరుతో రోజుకు 12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అంతదూరం వెళ్లి టీ తాగి వస్తామంటే విభాగాధిపతులు అంగీకరించే అవకాశం లేదు. పనిచేసే స్థలంలో కార్మికులకు మౌలిక సదుపాయాలు తీసివేయడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తున్నదేమో మరి. యాజమాన్యం ఏమి చేసినా పైనుంచి ఎవరూ ప్రశ్నించిన దాఖలాలు కనిపించడం లేదు.