పునఃశ్ఛరణ, నమూనా పరీక్షలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:16 PM
ఉద్యోగ సంబంధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పునఃశ్ఛరణ, నమూనా పరీక్షలరే ప్రాధాన్యం ఇవ్వాలని సివిల్స్ విజేత రావాడ సాయి మోహిని మానస సూచించారు.
పోటీ పరీక్షల అభ్యర్థులకు సివిల్స్ విజేత మానస సూచన
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంబంధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పునఃశ్ఛరణ, నమూనా పరీక్షలరే ప్రాధాన్యం ఇవ్వాలని సివిల్స్ విజేత రావాడ సాయి మోహిని మానస సూచించారు. పోటీ పరీక్షల శిక్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన స్థానిక గౌరీ గ్రంథాలయాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ, తల్లిదండ్రుల ప్రేరణ, స్వయం శ్రద్ధ, ఒక ప్రణాళిక ప్రకారం చదివితే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా విజయం సాదించవచ్చన్నారు. పరీక్షల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, వేగంగా జవాబులు రాయడంం కీలకమని, ఇందుకోసం రోజూ ఒకటి, రెండు ఆన్‌లైన్ నమూనా పరీక్షలు రాసి స్వీయ విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలని అన్నారు. పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు జ్ఞాపకశక్తి ఆధారితంగా ఉంటాయని, సహనం, పట్టుదల, ప్రణాళిక, సమయ సద్వినియోగంతో పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. నైపుణ్యాన్ని పెంచుకుంటే విజయం కచ్చితమన్నారు. భాష కన్నా కంటెంట్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలని మానస అన్నారు. గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ, భవిష్యత్తులో సివిల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అధ్యక్షుడు డి.నూకఅప్పారావు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు కొణతాల ఫణిభూషణ్‌శ్రీధర్, కాండ్రేగుల సత్యనారాయణ, మాజీ కార్యదర్శి మళ్ల బాపునాయుడు, కాండ్రేగుల జగ్గారావు, బొడ్డేడ జగ్గఅప్పారావు పాల్గొన్నారు.