గ్రామాల్లో ‘స్వచ్ఛ’తకు ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:39 AM
ప్రజల సహకారంతో ‘స్వచ్ఛ ఆంధ్ర’ లక్ష్యం నెరవేరుతుందని, దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే సాధన
శత శాతం పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి
కలెక్టర్ విజయకృష్ణన్
‘స్వచ్ఛ ఆంధ్ర-2025’ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానం
అనకాపల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
ప్రజల సహకారంతో ‘స్వచ్ఛ ఆంధ్ర’ లక్ష్యం నెరవేరుతుందని, దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం అనకాపల్లిలోని ఒక ప్రైవేటు కన్వెన్షన్ హాలులో జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర-2025’ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని, చెత్తను రోడ్లపై, ఆరుబయట పడేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా గ్రీన్ అంబాసిడర్‌లకు అందించి సహకరించాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు పొందేందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆమె అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నూరు శాతం పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్య్రమాన్ని అమలుచేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.
జిల్లా స్థాయి అవార్డులు అందజేత
జిల్లాస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను కలెక్టర్, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్‌ల చేతుల మీదుగా అందజేశారు. ఉత్తమ గ్రీన్ అంబాసిడార్లుగా అనకాపల్లి మండలం మార్టూరు పంచాయతీకి చెందిన ఆర్.అప్పారావు, కె.కోటపాడు మండలం చౌడువాడ పంచాయతీకి చెందిన ఎ.అప్పారావు, అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం పంచాయతీకి చెందిన వి.నూకాలమ్మ, ఎస్.రాయవరం మండలం గుడివాడ పంచాయతీకి చెందిన డి.కాసులు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ స్వచ్ఛంద సంస్థల కేటగిరీలో నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన మూర్తి అప్పారావు, పరిపాటి బాల, జీవీఎంసీ అనకాపల్లి జోన్‌కు చెందిన కశింకోట గోవింద అప్పలస్వామి, స్వచ్ఛ అంగన్‌వాడీల కేటగిరీలో సబ్బవరం మండలం అమృతపురం, చోడవరం మండలం చాకిపల్లి, నక్కపల్లి మండలం ఎన్.నర్సాపురం, నర్సీపట్నం మండలం వేములపూడి కేంద్రాల ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ బస్టేషన్‌ల కేటగిరీలో నాతవరం బస్టాండు, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా పంచాయతీ కార్యాలయం, స్వచ్ఛ ఆస్పత్రుల కేటగిరీలో రావికమతం మండలం కొత్తకోట పీహెచ్‌సీ, అనకాపల్లి జిల్లా ఆస్పత్రికి అవార్డులు అందజేశారు. స్వచ్ఛ వసతిగృహాల కేటగిరీలో కశింకోటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం, నర్సీపట్నంలోని బీసీ బాలుర వసతిగృహం, మాడుగుల మండలం తాటిపర్తిలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్‌కు అవార్డులు అందించారు. స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీలో (ఎంఎస్‌ఎంఈ) అచ్యుతాపురం సెజ్‌లోని మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్, స్వచ్ఛ మునిసిపాలిటీగా నర్సీపట్నం, స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాలలుగా నర్సీపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం, స్వచ్ఛ రైతు బజారు కేటగిరీలో అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డు, స్వచ్ఛ పాఠశాలల కేటగిరీలో నర్సీపట్నం మండలం వేములపూడి ఏపీఎంఎస్, కె.కోటపాడు మండలం కేజీబీవీ, అనకాపల్లి గవరపాలెం ఎంపీఎల్, పరవాడ మండలం తానాం జీహెచ్‌ఎస్, నక్కపల్లి మండలం వేంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు అవార్డులు అందజేశారు. స్వచ్ఛ ఎస్‌ఎల్‌ఎఫ్‌ల కేటగిరీలో ఎలమంచిలి మండలానికి చెందిన సీతారామ స్లమ్ సమాఖ్య, శ్రీసాయిబాబా స్లమ్ సమాఖ్యలకు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ కేటగిరీలో చీడికాడ మండలం చీడిపల్లి, నక్కపల్లి మండలం డొంకాడ, కశింకోట మండలం గొలుగొండ గ్రామాలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, డీఆర్‌ఓ సత్యనారాయణరావు, ఆర్డీఓ షేక్ ఆయీషా, డీపీఓ సందీప్, టీడీపీ సీనియర్ నాయకులు మాదంశెట్టి నీలబాబు, సబ్బవరపు గణేశ్ తదితరులు పాల్గొన్నారు.