పశు పోషణ, ఉద్యాన పంటలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:15 AM
జిల్లాలో పశు సంపద వృద్ధి, ఉద్యాన పంటలైన పూలు, కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముందని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ కె.విజయకృష్ణన్ తెలిపారు.
ప్రతి ఇంటిలో ఒకటికన్నా ఎక్కువ పశువులు ఉండేలా ప్రణాళిక
రైతులకు రాయితీపై మేలు జాతి పశువుల పంపిణీ
కలెక్టర్ల సదస్సులో విజయకృష్ణన్ నివేదిక
సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబునాయుడు
అనకాపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పశు సంపద వృద్ధి, ఉద్యాన పంటలైన పూలు, కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముందని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ కె.విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు హాజరైన ఆమె జిల్లా అభివృద్ధి నివేదికను సీఎం చంద్రబాబునాయుడు ముందుంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో పశుపోషణతోపాటు, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ప్రతి ఇంటిలో ఒకటికన్నా ఎక్కువ పశువులు ఉండేలా ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు. మేలుజాతి పశువులను ఇతర రాష్ట్రాల నంచి కొనుగోలు చేసి, జిల్లా రైతులకు రాయితీపై అందించేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కోరారు. విశాఖ నగరం దగ్గరలో ఉన్నందున కూరగాయలు, పువ్వుల వినియోగం ఎక్కువగా ఉంటుందని, అనకాపల్లి జిల్లాలో పండించే కూరగాయలు పెద్దఎత్తున విశాఖకు రవాణా అవుతున్నాయని, అందువల్ల కూరగాయలు, పూల సాగు విస్తీర్ణం మరింత పెంచేలా అనుమతులన్నారు. ఔత్సాహిక రైతును గుర్తించి బిందుసేద్యం విధానంలో కూరగాయల సాగు, పూలతోటల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. కలెక్టర్ విజయకృష్ణన్ సమర్పించిఇన నివేదికపై సీఎం చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారు. పశు సంతతి వృద్ధి, ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వ నుంచి సహకారం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఉద్యాన పంటల సాగు ద్వారా ఎక్కువమంది రైతులు లబ్ధిపొందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు.