Share News

విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్‌

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:26 AM

విచక్షణ కోల్పోయి ఇద్దరు విద్యార్థులను ఓ ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ స్టీల్‌ స్కేల్‌తో చితకబాదిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న డీఈవో అప్పారావునాయుడు స్కూల్‌ను సందర్శించి విద్యార్థులకు తగిలిన గాయాలను పరిశీలించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి.

విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్‌
స్కూల్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీసు ఇస్తున్న డీఈవో

- ప్రైవేటు స్కూల్‌ వద్ద తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ఆందోళన

- పాఠశాలను సందర్శించిన డీఈవో

- యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీ

- పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థుల కుటుంబ సభ్యులు

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విచక్షణ కోల్పోయి ఇద్దరు విద్యార్థులను ఓ ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ స్టీల్‌ స్కేల్‌తో చితకబాదిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న డీఈవో అప్పారావునాయుడు స్కూల్‌ను సందర్శించి విద్యార్థులకు తగిలిన గాయాలను పరిశీలించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. స్థానిక గాంధీనగరంలోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న పవన్‌కృష్ణ, షణ్ముఖ సాయిరాజ్‌ మధ్య శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో వాష్‌రూమ్‌ వద్ద వాగ్వాదం జరిగినట్టు మరో విద్యార్థి ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌కు చెప్పాడు. దీంతో ప్రిన్సిపాల్‌ పాఠశాల గదిలో ఉన్న పవన్‌కృష్ణ, షణ్ముఖ సాయిరాజ్‌లను స్టీల్‌ స్కేల్‌తో శరీరంపై తట్లు తేలేలా కొట్టారని ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ. ఈ విషయమై శనివారం స్కూల్‌ వద్దకు వచ్చిన తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న డీఈవో అప్పారావునాయుడు స్కూల్‌కు వచ్చి పరిశీలించారు. విద్యార్థుల శరీరాలపై ఉన్న తట్లును పరిశీలించి నివ్వెరపోయారు. ప్రిన్సిపాల్‌ అందుబాటులో లేకపోవడంతో ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని సూచిస్తూ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పద్మజకు నోటీసు అందజేశారు. అనంతరం పిల్లల కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాజాన దొరబాబు, గాడి బాలు, వియ్యపు రాజు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో స్కూల్‌ ప్రిన్సిపాల్‌

విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టి గాయపరిచిన స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎ.రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని శనివారం రాత్రి పట్టణ సీఐ టీవీ విజయ్‌కుమార్‌ తెలిపారు. గాంధీనగరంలోని ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థలో శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులను తీవ్రంగా కొట్టి గాయపరిచిన సంఘటనపై ఒక విద్యార్థి తండ్రి వరహాలబాబు శనివారం మధ్యాహ్నం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సంతోశ్‌కుమార్‌ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పట్టణ సీఐ తె లిపారు.

Updated Date - Sep 21 , 2025 | 12:26 AM