సైబర్ మోసాలకు అడ్డా
ABN , Publish Date - May 24 , 2025 | 01:02 AM
అచ్యుతాపురం కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా ఏడాది నుంచి కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంతకాలం పోలీసులు పట్టుకోకపోవడానికి కొంతమంది నేతలు, స్థానిక పోలీసులు అండదండలు వున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అచ్యుతాపురంలో ఏడాది క్రితమే కాల్ సెంటర్లు
అయినా గుర్తించలేని పోలీసు నిఘావర్గాలు
తొలుత మూసివేసిన ఒక పాఠశాల భవనాన్ని ఎంచుకున్న ముఠా
స్థానిక నాయకుడి ద్వారా భవనం యాజమానితో చర్చలు
కాల్ సెంటర్లపై లోతుగా ఆరా తీయడంతో లీజు ప్రయత్నం విరమణ
అపార్ట్‌మెంట్ల వైపు చూపు
రెట్టింపు అద్దె ఆఫర్ చేయడంతో వెంటనే ఇచ్చేసిన ఫ్లాట్ల యజమానులు
అమెరికాలోని అమెజాన్ కస్టమర్లే టార్గెట్ మోసాలు
ఎట్టకేలకు గుర్తు తెలియని వ్యక్తి సమాచారంతో దాడి చేసి పట్టుకున్న పోలీసులు
అచ్యుతాపురం, మే 23 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా ఏడాది నుంచి కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంతకాలం పోలీసులు పట్టుకోకపోవడానికి కొంతమంది నేతలు, స్థానిక పోలీసులు అండదండలు వున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను టార్గెట్ చేసుకుని.. అచ్యుతాపురం కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న మేఘాలయ, సిక్కం తదితర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 33 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ముఠా ఏడాది క్రితమే ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అచ్యుతాపురం-పూడిమడక రోడ్డులోని ఒక ప్రైవేటు పాఠశాలను కొన్ని కారణాల వల్ల రెండేళ్ల క్రితం మూసివేశారు. ఈ భవనం తమకు అద్దెకు కావాలని 2024 జూలైలో అచ్యుతాపురంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకుని ద్వారా పాఠశాల యజమానికి సమాచారం వచ్చింది. పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తామని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన భవనం యజమాని.. ఎందుకోసం భవనం అద్దెకు తీసుకుంటున్నారని అడిగారు. కాల్ సెంటర్ నిర్వహించడానికి అని సదరు నాయకుడు చెప్పగా.. కాల్ సెంటర్లపై అప్పటికే అవగాహన వున్న సదరు భవనం యజమాని.. ఏ తరహా కాల్ సెంటర్ నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో పాఠశాల భవనం అద్దెకు తీసుకునే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తర్వాత అచ్యుతాపురం పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో భోగాపురం పరిధిలోని అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల యాజమానులతో మాట్లాడి, కాల్ సెంటర్ల నిర్వాహకులకు అద్దెకు ఇప్పించాడు. 25 ఫ్లాట్లకు నెలకు రూ.6 లక్షల చొప్పున అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. వాస్తవంగా ఇక్కడ 2 బీహెచ్‌కే ఫ్లాట్ అద్దె రూ.10 వేలకు అటుఇటుగా వుంటుంది. కానీ ఇంతకు రెట్టింపు అద్దె వస్తుండడంతో అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల యజమానులు ముందూ వెనుకా ఆలోచించకుండా స్థానిక రాజకీయ నాయకుడు చెప్పాడన్న ఉద్దేశంతో అద్దెకు ఇచ్చేశారు. సెజ్‌లోని పరిశ్రమల్లో పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉద్యోగులుగా, కార్మికులుగా పనిచేస్తున్నారు. దీంతో ఫ్లాట్లను అద్దెకు తీసుకున్న వారి గురించి యజమానులతోపాటు స్థానికులు కూడా అంతగా పట్టించుకోలేదు. కాగా పోలీసు నిఘా వర్గాలు మాత్రం ఏడాది నుంచి ఇక్కడ కాల్ సెంటర్లు నడుపుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నిందితులను లోతుగా విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం వుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.