జన గణన కోసం ముందస్తు సర్వే
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:31 PM
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీటెస్ట్(ముందస్తు పరిశీలన సర్వే) జన గణనను సమర్థంగా నిర్వహించాలని ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్(డీసీవో), డైరెక్టర్ ఆఫ్ సిటిజన్ రిజిస్ట్రేషన్(డీసీఆర్) ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి జె.నివాస్ ఆదేశించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో చేయాలి
తొలి విడతగా ఇళ్ల జియో ట్యాగింగ్, వసతుల వివరాలు సేకరించాలి
డీసీఆర్ ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి జె.నివాస్
గూడెంకొత్తవీధి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీటెస్ట్(ముందస్తు పరిశీలన సర్వే) జన గణనను సమర్థంగా నిర్వహించాలని ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్(డీసీవో), డైరెక్టర్ ఆఫ్ సిటిజన్ రిజిస్ట్రేషన్(డీసీఆర్) ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి జె.నివాస్ ఆదేశించారు. గూడెంకొత్తవీధి మండలం ఈఎంఆర్ పాఠశాలలో 2027లో నిర్వహించే జన గణన కోసం ముందస్తుగా నిర్వహించే సర్వే నిమిత్తం మూడు రోజులుగా జరుగుతున్న ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. ముందుగా ఆయనకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమంలో జె.నివాస్ మాట్లాడుతూ 2027లో నిర్వహించే జన గణన కోసం ముందస్తు సర్వే నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా నాలుగు చార్జెస్ మండలాలను ఎంపిక చేయగా, ఇందులో జీకేవీధి ఒకటని చెప్పారు. ముందస్తు సర్వే పూర్తిగా డిజిటలైజేషన్ ద్వారా జరుగుతుందన్నారు. గతంలో జన గణన మ్యాప్‌ల ద్వారా జరిగేదన్నారు. ప్రస్తుతం డిజిటల్ లేఅవుట్, హెచ్‌ఎల్‌వో యాప్ ద్వారా చేస్తున్నట్టు చెప్పారు. జీకేవీధి మండలంలో 18 గ్రామాల్లో సర్వే చేసేందుకు ఎంపిక చేశామన్నారు. ఈ సర్వే కోసం 29 మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఈ నెల పదో తేదీ నుంచి 30 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసిన ఇంట్లోని వసతుల వివరాలను తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో కుటుంబ సభ్యుల వివరాలపై సర్వే చేయాలన్నారు. ఈ సర్వేకి తహసీల్దార్ చార్జ్ అధికారిగా ఉంటారన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ముందస్తు సర్వేను ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు పక్కాగా నిర్వహించాలని తెలిపారు. కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ సర్వే నిర్వహణలో వచ్చే సందేశాలు, సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు టెక్నికల్ అధికారులు జీకేవీధిలో అందుబాటులో ఉంటారన్నారు. సర్వేలో తలెత్తిన సమస్యలను టెక్నికల్ అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తారన్నారు. ముందస్తు సర్వేను ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ అధికారి జి.ప్రసన్నకుమార్, డిప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, రీసెర్చ్ అధికారి(మ్యాప్ సెక్షన్) రమాదేవి, డీపీఏ సీహెచ్ వెంకటరమణ, ఎస్‌ఐ గ్రేడ్-2 ఎం. రాజమోహన్‌రెడ్డి, చార్జి అధికారి హెచ్.అన్నాజిరావు పాల్గొన్నారు.