Share News

10న రాష్ట్రపతి రాక

ABN , Publish Date - May 28 , 2025 | 01:05 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల పదో తేదీన విశాఖపట్నం రానున్నారు.

10న రాష్ట్రపతి రాక

గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ద్రౌపది ముర్ము

విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల పదో తేదీన విశాఖపట్నం రానున్నారు. ఆర్కే బీచ్‌రోడ్డులో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. పదో తేదీ ఉదయం 9.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టులో గౌరవ వందనం స్వీకరించిన తరువాత 11.40 గంటలకు రోడ్‌ మార్గాన బయలుదేరి ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి బయలుదేరి 1.10 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 1.20 గంటలకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్‌ వెళతారు.


భువనేశ్వర్‌ విమాన సర్వీస్‌కు వీజీఎఫ్‌

విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య జూన్‌ 12వ తేదీ నుంచి కొత్త విమాన సర్వీస్‌ ప్రారంభం కానుంది. దీనిని ఇండిగో సంస్థ నడుపుతుంది. ఒకవేళ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండి ఆ సంస్థకు ఏమైనా నష్టాలు వచ్చినట్టయితే ‘వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌’ (వీజీఎఫ్‌) ద్వారా భర్తీ చేయడానికి ఒడిశా ప్రభుత్వం అంగీకరించింది. దీనికి కృషిచేసిన ఆ రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబును ఏపీ విమాన ప్రయాణికుల సంఘం (అపాటా) ప్రతినిధులు నరేశ్‌కుమార్‌, కాశీవిశ్వనాథరాజు, డీఎస్‌ వర్మలు భువనేశ్వర్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమాన సర్వీస్‌ ప్రతిరోజూ విశాఖపట్నానికి మధ్యాహ్నం 1.55 గంటలకు వచ్చి, తిరిగి 2.25 గంటలకు బయలుదేరి భువనేశ్వర్‌ వెళుతుంది. వారానికి నాలుగు రోజులు నడిచే అబుదాబి విమానం జూన్‌ 13 నుంచి ప్రారంభమవుతుందని, ఇది ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం వచ్చి, తిరిగి ఇక్కడి నుంచి 9.50 గంటలకు బయలుదేరుతుందని వారు తెలిపారు.

Updated Date - May 28 , 2025 | 01:05 AM