బిర్సాముండా స్ఫూర్తితో ఆదివాసీల సంస్కృతి పరిరక్షణ
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:30 PM
ఆదివాసీ యోధుడు బిర్సాముండా స్ఫూర్తితో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్
వందేళ్ల క్రితమే ఆదివాసీల కోసం బిర్సాముండా పోరాటం
పాడేరులో 16న బిర్సా ముండా జయంతి వేడుకలు
పాడేరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ యోధుడు బిర్సాముండా స్ఫూర్తితో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ అన్నారు. జన జాతి గౌరవ దివాస్ ఉత్సవ ఉద్యోగ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌జీవో హోమ్‌లో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వందేళ్ల క్రితమే ఆదివాసీల ఉనికి, అస్థిత్వం కోసం బిర్సాముండా అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన సేవలు, త్యాగాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో పాటు ఆదివాసీ యోధుడికి గుర్తింపు కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు బిర్సాముండా జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. ఆదివాసీ యోధుడు బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని ఈనెల 16వ తేదీన పాడేరులో జయంతి వేడుకల నిర్వహిస్తున్నట్టు మాధవ్ కోరారు. పార్టీలకు అతీతంగా నిర్వహించే ఈ వేడుకల్లో రాష్ట్రంలోని అన్ని గిరిజన తెగలకు చెందిన ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు పాల్గొవాలన్నారు. అంతకు ముందు బిర్సాముండా చిత్రపటానికి ఆయన పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం 16వ తేదీన నిర్వహించే వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మట్టా ప్రసాద్, ఏపీ ఎస్‌టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, ఏపీ జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షుడు పాంగి రాజారావు, కార్యదర్శి స్వప్నకుమారి, మాజీ మంత్రి మణికుమారి, ట్రైకార్ డైరెక్టర్ కూడ కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శాంతకుమారి, ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ, బీజేవైఎం నేతలు ఎం.గోపాలపాత్రుడు, పి.మత్స్యకొండబాబు, జేఏసీ చైర్మన్ రామారావుదొర, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.