Share News

స్ర్తీశక్తికి సన్నద్ధం

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:14 AM

గత ఏడాది ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’లో ఒకటైన ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

స్ర్తీశక్తికి సన్నద్ధం

  • ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం

  • పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో అమలు

  • కండక్టర్‌కు ఆధార్‌ కార్డు చూపితే..‘జీరో ఫేర్‌’ టికెట్‌ జారీ

  • జిల్లాలో 89 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం

  • నెలకు సుమారు రూ.3 కోట్ల చొప్పున ఆర్టీసీకి చెల్లించనున్న ప్రభుత్వం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత ఏడాది ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’లో ఒకటైన ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ నెల 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నది. ఇందుకు సంబంధించి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తున్నది. జిల్లాలోని రెండు డిపోల్లో వున్న 89 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం వుంది. ఈ పథకం వల్ల సంస్థపై నెలకు సుమారు రూ.3 కోట్ల భారం పడుతుందని, ఈ సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ గత ఏడాది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ముఖ్యంగా సూపర్‌ సిక్స్‌లో ప్రధానమైన ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ పథకాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకానికి ‘స్ర్తీ శక్తి’ అని పేరుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు, యువతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ సర్వీసు వంటి ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మహిళలు, యువతులు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఈ పథకం వర్తిస్తుంది. బస్సు ఎక్కిన తరువాత ఆధార్‌ కార్డును కండక్టర్‌కు చూపించాలి. కండక్టర్‌ ‘జీరో ఫేర్‌’ టికెట్‌’ను జారీ చేస్తారు. తరువాత ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకాన్ని శుక్రవారం నుంచి అమలు చేసేందుకు జిల్లా ప్రజా రవాణా శాఖాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

జిల్లాలో 89 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం

జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల పరిధిలో మొత్తం 204 బస్సులు ఉన్నాయి. ఇందులో అనకాపల్లి డిపోలో 98, నర్సీపట్నం డిపోలో 106 వున్నాయి. వీటిల్లో 89 శాతం బస్సులు పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ సర్వీసులకు చెందినవి వున్నాయి. ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం రెండు డిపోలకు చెందిన బస్సుల్లో రోజూ సుమారు 48 వేల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 20 వేల మంది వరకు మహిళలు, విద్యార్థినులు వుంటారని అంచనా. చార్జీల రూపంలో రోజూ రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల రోజుకు రూ.10 లక్షల వరకు ఆదాయం తగ్గుతుంది. ఈ సొమ్మును ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేస్తుంది.

డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణ...

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు పూర్తిచేశారు. డీపీటీవో ప్రవీణ ఆధ్వర్యంలో 262 మంది డ్రైవర్లు, 320 మంది కండక్టర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఉచిత పథకం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ప్రయాణికులపట్ల ఎలా నడుచుకోవాలి, ప్రభుత్వ మార్గదర్శకాలను ఎలా అమలు చేయాలన్నదానిపై డ్రైవర్లు, కండక్ట్లకు ఇప్పటికే శిక్షణ అందించారు.

ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తి

ప్రవీణ, డీపీటీవో

జిల్లాలో స్త్రీ శక్తి పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఉచిత ప్రయాణం కావడంతో కొంతమేర రద్దీ పెరుగుతుందని భావిస్తున్నాం. మహిళలతోపాటు ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్‌ నియంత్రణ సిబ్బందిని నియమిస్తున్నాం. మహిళలు బస్సు ఎక్కిన తరువాత కండక్టర్‌కు ఆధార్‌ కార్డు చూపించి, ఎక్కడికి వెళ్లాలో చెబితే ‘జీరో ఫేర్‌’ టికెట్‌ జారీ చేస్తారు.

Updated Date - Aug 14 , 2025 | 01:14 AM