Share News

‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధం!

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:59 AM

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు వచ్చే ఏడాది జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా అధికారులు దృష్టి సారించారు.

‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధం!
గ్రామ పంచాయతీ కార్యాలయం

ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టిన ఎన్నికల సంఘం

వచ్చే నెలలో ఓటరు జాబితాలు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ

నవంబరులో ఎన్నికల సిబ్బంది, సామగ్రి సిద్ధం

పంచాయతీలకు వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం

ఫిబ్రవరిలో మునిసిపాలిటీలు, జూన్‌లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు..

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు వచ్చే ఏడాది జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా అధికారులు దృష్టి సారించారు.

గ్రామ పంచాయతీలకు 2021 జనవరి/ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు దశల్లో పోలింగ్‌ జరిగింది. మొదటి దశలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌, రెండో దశలో నర్సీపట్నం డివిజన్‌, మూడో దశలో పాడేరు డివిజన్‌, నాలుగో దశలో విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. వాస్తవంగా 2020లోనే ఎన్నికలు జరగాల్సి వుండగా, కరోనా వైరస్‌ కారణంగా మరుసటి సంవత్సరానికి వాయిదాపడ్డాయి. ఆయా పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. అయితే గడువుకన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నీలం సాహ్ని భావిస్తున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ కమిషర్లకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటర్ల జాబితాల రూపకల్పన వంటి పనులు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆయా అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందాయి. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు విడుదల చేసినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. అక్టోబరు 16వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలి. నెలాఖరులోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. నవంబరు 16వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఎన్నికల సిబ్బంది ఎంపిక, పోలింగ్‌ కేంద్రాలు, బ్యాలట్‌ బాక్సులు సిద్ధం చేయాలి. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌తోపాటు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది.

ఇదిలావుండగా మునిసిపల్‌ పాలకవర్గాల పదవీ కాలం వచ్చేఏడాది మార్చితో ముగుస్తుంది. అయితే ఈసారి రెండు, మూడు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు వుంది. ఈ స్థానాలకు కూడామూడు నెలల ముందుగానే.. అంటే జూన్‌ లేదా జూలై నెలల్లో నిర్వహించే అవకాశం వుంది. జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు, 24 జడ్పీటీసీ స్థానాలు, 350కిపైగా ఎంపీటీసీ స్థానాలు, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో వున్న అనకాపల్లి జోనల్‌ ప్రాంతాన్ని మినహాయిస్తే జిల్లాలో సుమారు 11 లక్షల మంది ఓటర్లు వున్నారు.

రాజకీయ పార్టీలు వ్యూహాలు

గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ఇప్పటికే కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే.. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. కానీ ఈసారి కూటమి అధికారంలో వుండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని ఆయా పార్టీల నేతలు అంటున్నారు.

ఓటరు జాబితాలను సిద్ధం చేస్తాం

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి సందీప్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా.. ఓటరు జాబితాల తయారీ, వార్డుల విభజన, సర్పంచ్‌/ వార్డు పదవుల రిజర్వేషన్‌లపై కసరత్తు జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల ప్రకారం ముందస్తు ఎన్నికల ఏర్పాట్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:59 AM