పారిశుధ్యం పేరుతో దోపిడీకి సన్నద్ధం
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:26 AM
నగరంలో పారిశుధ్య నిర్వహణ పేరుతో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి.
తాత్కాలిక కార్మికుల పేరుతో చెల్లింపులకు ప్రతిపాదనలు
నేడు స్టాండింగ్ కమిటీ సమావేశం
205 అంశాలతో అజెండా...
మెజారిటీ అంశాలు ప్రజారోగ్యానివే
విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పారిశుధ్య నిర్వహణ పేరుతో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. తాత్కాలిక కార్మికులతో వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టామని, వారందరికీ వేతనాలు చెల్లించాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి స్టాండింగ్ కమిటీ ఆమోదానికి పంపించడం చర్చనీయాంశంగా మారింది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకునేందుకు 205 అంశాలతో జంబో అజెండాను తయారుచేసి సభ్యులకు అందజేశారు. నగరంలో తరచూ ప్రముఖులు పర్యటిస్తున్నందున రోడ్లను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని, అయితే సరిపడా సిబ్బంది లేకపోవడంతో తాత్కాలిక పద్ధతిలో నియమించినందున వారికి వేతనాలు చెల్లించాలంటూ భారీగా బిల్లులు తయారుచేశారు. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు వెయ్యి మందికిపైగా రెగ్యులర్ కార్మికులు, సుమారు ఆరు వేల మంది అవుట్‌సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ, అధికారులు తరచూ తాత్కాలిక సిబ్బంది పేరుతో భారీగా వేతనాలను చెల్లిస్తుండడం అనుమానాలకు దారితీస్తోంది. బుధవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి అజెండాను ఈనెల 18నే తయారుచేసి, సభ్యులకు అందజేసినప్పటికీ మీడియాకు మాత్రం మంగళవారం వరకూ విడుదల చేయలేదు. 205 అంశాలతో తయారుచేసిన అజెండాలో సుమారు 30 అంశాలు దుకాణాలు అద్దెలు, లీజులకు సంబంధించినవి కాగా మరో 50 వివిధ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినవి, ఉద్యోగుల సర్వీసుకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. దాదాపు వందకుపైగా అంశాలు కేవలం ప్రజారోగ్యానికి సంబంధించినవే ఉన్నాయి. చేసిన పనికి రెండు, మూడు రెట్లు అధికంగా మనుషులను చూపించి బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే గత ఏడాది జూలై 24న సీఎం చంద్రబాబునాయుడు అనకాపల్లి పర్యటన సందర్భంగా రోడ్లకు ఇరువైపులా తుప్పలు తొలగించడానికి రూ.1.64 లక్షలు ఖర్చు అయినందున ఆ మొత్తాన్ని చెల్లించాలంటూ ఇప్పుడు ప్రతిపాదించారు. ఇలాంటివి అనేక అంశాలు ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగానీ, మేయర్‌గానీ అభ్యంతరం తెలపకుండానే ఆమోదించేస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరిగే సమావేశంలో మేయర్‌తోపాటు సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది.
సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా సుజాత
సింహాచలం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాధ్యతలు దేవదాయశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాతకు అప్పగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరిగిన సింహాద్రినాథుని నిజరూప దర్శనం సందర్భంగా గోడ కూలి భక్తులు మృతిచెందడం, అప్పన్న ఆభరణాల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ఈవో వేండ్ర త్రినాథరావును తక్షణం రిలీవ్ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా నూతన ఈవో సుజాతకు పలుమార్లు తాత్కాలిక ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది.
నేడు శాసనసభాపక్ష పిటిషన్ల కమిటీ రాక
విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణ రాజు నేతృత్వంలోని శాసనసభాపక్ష పిటిషన్ల కమిటీ బుధవారం జిల్లాలో పర్యటించనున్నది. ఫిర్యాదుల పరిశీలన నిమిత్తం వస్తున్న కమిటీ ఉదయం 11 గంటలకు జిల్లా అధికారులతో సమావేశం కానున్నది. ఆహార భద్రతా విధానం, ఫుడ్ సేఫ్టీ, ఇతర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించి ఫిర్యాదులు స్వీకరించనుంది. కమిటీ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, సభ్యులు గంటా శ్రీనివాసరావు, గురజాల జగన్ మోహన్, కొణతాల రామకృష్ణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.