పాఠశాలల్లో ముస్తాబు అమలుకు సన్నాహాలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:33 AM
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండేందుకు దోహదం చేసే ‘ముస్తాబు’ కార్యక్రమం జిల్లాలో అమలు చేసేందుకు విద్యా శాఖ నిర్ణయించింది.
విద్యా శాఖ నుంచి మార్గదర్శకాలు
ప్రతి తరగతి ముందు అద్దం ఏర్పాటు
విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రంగా ఉండేందుకు దోహదం
నేడు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలల ఆవరణలు శుభ్రం
విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండేందుకు దోహదం చేసే ‘ముస్తాబు’ కార్యక్రమం జిల్లాలో అమలు చేసేందుకు విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ముస్తాబు అమలు చేయాలని రెండు రోజులక్రితం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు.
జిల్లాలో ప్రభుత్వ పరిధిలో గల 562 పాఠశాలల్లో ‘ముస్తాబు’ అమలు చేయనున్నారు. కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గది ముందు అద్దం ఏర్పాటుచేస్తారు. ప్రతి విద్యార్థి తరగతిలోకి ప్రవేశించే ముందు అద్దం ముందు నిల్చోవాలి. శుభ్రంగా ఉండే యూనిఫాం, షూతో పాఠశాలకు రావాలి. చేతులు, ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి. తలకు నూనె రాసుకుని చక్కగా దువ్వుకోవాలి. మరుగుదొడ్డికి వెళ్లిన తరువాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం చేయాలి. ఇదే సమయంలో పాఠశాలలో శుభ్రమైన తాగునీటిని అధికారులు అందించాలి. విద్యార్థి పరిశుభ్రంగా ఉండడం వల్ల శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు రావని, దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, చదువు అబ్బి...మంచి పౌరుడిగా ఎదుగుతారని డీఈవో ప్రేమకుమార్ తెలిపారు. ఇందుకు ప్రతి తరగతికి ఇద్దరు విద్యార్థులను లీడర్లుగా ఎన్నుకుంటారు. వారు మిగిలిన విద్యార్థులను పరిశీలిస్తారు. వారం పొడవునా ఏ విద్యార్థి అయితే అన్ని విధాలా ముస్తాబుతో ఉంటే అతని పేరు తరగతి గదిలో ప్రకటిస్తారు. వారిని ముస్తాబు స్టార్స్‌గా గుర్తిస్తారు. ప్రధానోపాధ్యాయుడు ప్రతివారం సమీక్ష చేయాలి. ప్రతినెలా ముస్తాబుపై విద్యా శాఖకు నివేదిక ఇవ్వాలి. అధికారులు తరచూ పాఠశాలలు సందర్శించి ముస్తాబు అమలు తీరును పర్యవేక్షించాలి. ముస్తాబు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కొన్ని పాఠశాలలు శుక్రవారం నుంచి శుభ్రం చేయడం ప్రారంభించారు. కాగా ప్రతి తరగతి గది వద్ద అద్దం ఉండేలా ఏర్పాట్లుచేస్తున్నామని డీఈవో తెలిపారు. ప్రస్తుతానికి పాఠశాలలో అందుబాటులో ఉన్న నిధులతో వీటిని సమకూర్చాలని, ప్రభుత్వం నిధులు ఇస్తే పాఠశాలకు జమ చేస్తామన్నారు. గ్రామాల్లో దాతలు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థుల ద్వారా ముస్తాబు అమలుకు అవసరమైన వస్తువులు కొనుగోలుకు యత్నించాలని సూచించారు.