కన్నతల్లికి గర్భశోకం
ABN , Publish Date - May 18 , 2025 | 12:45 AM
ఏడాది వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులను కోల్పోయిన ఆ తల్లికి కడుపుకోత మిగిలింది. గత సంవత్సరం అనారోగ్యంతో చిన్న కుమారుడు మృతిచెందగా, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు కూడా శాశ్వతంగా దూరమయ్యాడు. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం మండలం బొర్రమ్మ గెడ్డ వద్ద ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని, వెనుక నుంచి వస్తున్న బైక్ డీకొనడంతో బాలుడు మృతిచెందాడు. బైక్ నడుపున్న తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడి మృతి
తీవ్రంగా గాయపడిన భర్త, పరిస్థితి విషమం
స్వల్ప గాయాలతో బయటపడిన భార్య
గత ఏడాది అనారోగ్యంతో చిన్న కుమారుడి మృతి
సబ్బవరం, మే 17 (ఆంధ్రజ్యోతి): ఏడాది వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులను కోల్పోయిన ఆ తల్లికి కడుపుకోత మిగిలింది. గత సంవత్సరం అనారోగ్యంతో చిన్న కుమారుడు మృతిచెందగా, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు కూడా శాశ్వతంగా దూరమయ్యాడు. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం మండలం బొర్రమ్మ గెడ్డ వద్ద ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని, వెనుక నుంచి వస్తున్న బైక్ డీకొనడంతో బాలుడు మృతిచెందాడు. బైక్ నడుపున్న తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ పి.సింహాచలం, బాలుడి బంధువులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
నాతవరం మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన నక్క అప్పలనాయుడు, అప్పలకొండ సోదరులు. వీరు కుటుంబాలతో సహా ఆనందపురం మండలం గిడిజాల సమీపంలోని నీలకుండీలు వద్ద నివాసం వుంటూ, అక్కడే వున్న ఫ్లైయాష్ ఇటుకల తయారీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. సొంతూరులో అమ్మవారి పండుగ వుండడంతో ఇటీవల వెళ్లారు. శనివారం ఉదయ తొలుత అప్పలకొండ, అతని భార్య మంగ ద్విచక్ర వాహనంపైన, గంట తరువాత అప్పనాయుడు, భారా పద్మ, కుమారుడు మనోజ్ (9) మరో బైక్‌పై బయలుదేరారు. సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం సమీపంలో బొర్రమ్మ గెడ్డ వద్ద ఆగిఉన్న బొలేరో వ్యాన్‌ను అప్పలనాయుడు గమనించక బైక్‌తో బలంగా ఢీకొన్నాడు. బైక్‌పై ముందు కూర్చున్న మనోజ్‌కు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పలనాయుడు తీవ్రంగా, పద్మ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ పి.సింహాచలం సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లారు. క్షతగాత్రులను 108 వాహనంలో పెందుర్తిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పలనాయుడు పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అప్పలకొండ, మంగ వచ్చి విగతజీవిగా మారిన మనోజ్‌ను చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. మనోజ్ తమ్ముడు శర్వాన్ సత్యనారాయణ గత ఏడాది అనారోగ్యంతో మృతిచెందాడని, మిగిలిన ఒక్కగానొక్క కుమారుడు ఇప్పుడు రోడ్డు దూరమయ్యాడని వారు వాపోయారు. అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.