Share News

సొసైటీ ఉద్యోగులకు పీఆర్‌సీనా!?

ABN , Publish Date - May 08 , 2025 | 01:13 AM

సహకార ఉద్యోగులకు పీఆర్‌సీ వర్తింపజేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు ఉండాలి. కానీ విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం అవేమీ పట్టించుకోలేదు.

సొసైటీ ఉద్యోగులకు పీఆర్‌సీనా!?

  • ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారని ముందూ వెనుకా ఆలోచించకుండా ఈపీడీసీఎల్‌ నిర్ణయం

  • మలిదశలో కాంట్రాక్టు వర్కర్లకు కూడా అమలు చేసేందుకు ఒప్పందం?

  • బకాయిలు రూ.25 కోట్లు ఇచ్చేస్తామంటూ ఆఫర్‌

  • వరుస తప్పులు చేస్తున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సహకార ఉద్యోగులకు పీఆర్‌సీ వర్తింపజేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు ఉండాలి. కానీ విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం అవేమీ పట్టించుకోలేదు. అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్‌సీ ప్రకారం జీతాలు కావాలని లేఖలు రాసిన వెంటనే ముందువెనుకా ఆలోచించకుండా నిర్ణయం తీసేసుకుంది. ఆయా జిల్లాల అధికారులకు లేఖలు పంపింది. దాంతో మే నెలలోనే వారికి కొత్త జీతాలు జమ అయ్యాయి.

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)లో కొన్నేళ్లుగా అడ్డగోలు వ్యవహారాలు జరుగుతున్నాయి. అక్కడ ముందు క్యాజువల్‌ వర్కర్‌గా చేర్చుకొని ఆ తరువాత వారికి ఏదో ఒక డిజిగ్నేషన్‌ ఇచ్చేసి రెగ్యులర్‌ ఉద్యోగులుగా మార్చేసుకుంటున్నారు. అది సొసైటీ కావడంతో పాలకవర్గం ఏది చేస్తే అది చెల్లింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎటువంటి రిక్రూట్‌మెంట్‌ ప్రకటన లేకుండానే బీటెక్‌ చదివిన 15 మందిని ఉద్యోగులుగా తీసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారం నుంచి దిగిపోయే ముందు వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్టు తీర్మానం చేసి శాశ్వత ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచారు. తాజాగా వారికి 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారితో సహా కొత్త పీఆర్‌సీ-2022 వర్తింపజేశారు. అలాగే వైసీపీ నాయకుడు ఒకరు...25 మంది వద్ద రూ.6 లక్షలు చొప్పున తీసుకొని లైన్‌మెన్‌కు అసిస్టెంట్లుగా నియమించారు. వారికి నెలకు రూ.20 వేలు జీతం ఇస్తున్నారు. దీనిపై అప్పుడే పెద్ద దుమారం రేగింది. ఈ విధంగా ఆర్‌ఈసీఎస్‌లో కాంట్రాక్టు పేమెంట్‌ వర్కర్లు (సీపీడబ్ల్యు) 492 మంది ఉన్నారు. అవసరాలకు మించి ఉద్యోగులు ఉన్నా ఈపీడీసీఎల్‌ పట్టించుకోవడం లేదు.

శాశ్వత ఉద్యోగులు 120 మందికి ఇప్పుడు పీఆర్‌సీ-2022 ఇచ్చామని, మలి దశలో మిగిలిన సీపీడబ్ల్యు ఉద్యోగులు 492 మందిని శాశ్వత ఉద్యోగులుగా మార్చి, పీఆర్‌సీ అమలు చేస్తామని ప్రస్తుత నాయకులు ఆశ పెట్టారు. దానికి ప్రాసెసింగ్‌ కూడా జరిగిపోతోంది. ఇప్పుడు ఉద్యోగుల సంఘం రాసిన లేఖను చూపించి కొత్త పీఆర్‌సీ ఎలా ఇచ్చేశారో...వారితో కూడా అలాగే ఒక లేఖ రాయించి, దాని ప్రకారం పర్మనెంట్‌ చేయిస్తామని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే ఆయా ఉద్యోగులకు రూ.25 కోట్ల వరకూ బకాయిలు వస్తాయి. సాయం చేసినందుకు ఆ మొత్తం మీకే ఇచ్చేస్తామని, శాశ్వత ఉద్యోగులుగా ఉంటే చాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ డబ్బుల కోసం ఆశపడి ఈపీడీసీఎల్‌ అధికారులు దిద్దుకోలేని తప్పులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్‌ఈసీఎస్‌లో ఎప్పటినుంచో పాతుకుపోయిన ప్రాజెక్టు ఇంజనీర్‌, ఈపీడీసీఎల్‌ అధికారి ఒకరు కలిసి ఇదంతా ప్లాన్‌ చేశారని, దీనికి కూటమి నాయకులు సహకరిస్తున్నారని తెలిసింది. విజయవాడ నుంచి మౌఖికంగా చెప్పినందున పీఆర్‌సీ ఇచ్చామని కార్పొరేట్‌ కార్యాలయం నమ్మబలుకుతోంది. దీనిపై సొసైటీ పర్సన్‌ ఇన్‌చార్జి, జిల్లా కలెక్టర్‌ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వానికే లేఖ రాయాలని స్థానిక సంఘాలు సమాయత్తవుతున్నాయి.

Updated Date - May 08 , 2025 | 01:13 AM