Share News

ప్రతికా, స్మృతి పోరు వృథా!

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:52 AM

సిక్సర్లు, బౌండరీలతో పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం హోరెత్తింది.

ప్రతికా, స్మృతి  పోరు వృథా!

  • భారీ టార్గెట్‌ను ఛేదించిన ఆస్ట్రేలియా

  • సెంచరీతో కదంతొక్కిన అలిస్సా హిలి

  • భారత్‌కు మరోసారి నిరాశ

  • ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో పరుగుల వరద

  • క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ జోష్‌

విశాఖపట్నం, స్పోర్ట్స్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):

సిక్సర్లు, బౌండరీలతో పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం హోరెత్తింది. భారత్‌ మహిళా బ్యాటర్లు పసందైన క్రికెట్‌ మజానందించినా ప్రేక్షకులకు గెలుపు ఆనందం దక్కలేదు. భారత ఓపెనర్లు ప్రతికా రావల్‌, స్మృతి మందాన సొగసైన షాట్‌లతో ప్రేక్షకులకు కనువిందు చేసినా ఫలితం లేకపోయింది. భారీ లక్ష్యాన్ని ఆస్ర్టేలియా మహిళలు సునాయాసంగా ఛేదించి భారత్‌కు ఝలక్‌ ఇచ్చారు.

మహిళల వన్డే ప్రపంచ కప్‌ టోర్నీలో భాగంగా ఆదివారం పీఎంపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. భారత్‌ ఇన్నింగ్‌ ఆద్యంతం స్టేడియం కరతాళ ధ్వనులతో మర్మోగగా, దీటైన బ్యాటింగ్‌ చేసిన ఆస్ర్టేలియా ఇన్నింగ్స్‌ ఆద్యంతం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో అనూహ్య ఓటమితో పాఠాలు నేర్చుకున్న భారత్‌ మహిళలు ఆ సారి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నుంచి కంగారూలను బెంబేలెత్తించినా బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఓటమి పాలు కాక తప్పలేదు. ఆస్ర్టేలియా ఓపెనర్‌ అలిస్సా హిలి భారీ సెంచరీతో (142) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి తమ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. భారత్‌పై దక్షిణాఫ్రికా చివరిగా సిక్సర్‌ కొట్టి గెలుపొందగా....ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కూడా ఆస్ర్టేలియా సిక్సర్‌తోనే విజయం సాధించడం విశేషం.

చెలరేగిన స్మృతి మందాన, ప్రతికా రావల్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రతికా రావల్‌ (75), స్మృతి మందాన (80) చెలరేగారు. ఎనిమిదో ఓవర్లో సోఫీ బౌలింగ్‌లో స్మృతి మందాన స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బౌండరీ, లాంగ్‌ ఆన్‌ మీదుగా సిక్సర్‌, మిడ్‌ వికెట్‌ మీదుగా మరో బౌండరీ బాది స్కోరు బోర్డును పరిగెత్తించింది. అదే ఓవర్లో స్క్వేర్‌ లెగ్‌ వద్ద అవుట్‌ నుంచి తప్పించుకుంది. తొమ్మిదో ఓవర్‌లో గార్డనర్‌ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ ప్రతికా రావాల్‌ లాంగ్‌ ఆన్‌ మీదుగా సిక్సర్‌, మిడాఫ్‌ మీదుగా బౌండరీ కొట్టి ఆసీస్‌ బౌలర్లను బెంబేలెత్తించింది. స్మృతి మందాన 46 బంతుల్లో 7 బౌండరీలు, ఒక సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేయగా...ప్రతికా రావల్‌ 69 బంతుల్లో 7 బౌండరీలు, ఒక సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ సాధించింది.

నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు

భారీ స్కోరు దిశగా సాగుతున్న భారత్‌ మహిళలు అనవసర షాట్‌లకు ప్రయత్నించి వికెట్లు పొగొట్టుకున్నారు. ఫలితంగా మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే, 48.5 ఓవర్లకు ఆలౌటయ్యారు. వికెట్ల ముందు సెటల్‌ అయిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ (22), రోడ్రిగస్‌ (33), రిచా ఘెష్‌ (32) అనవసర షాట్‌లతో వికెట్లు సమర్పించుకున్నారు. నాలుగు ఓవర్లలో వరుసగా ఐదు వికెట్లు పోగొట్టుకోవడం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

సెంచరీతో హిలి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌

ఆస్ర్టేలియా ఓపెనర్‌ అలిస్సా హిలి సెంచరీతో (142) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ ఆశలపై నీళ్లు చల్లింది. మరో ఓపెనర్‌ లిచ్‌ ఫీల్డ్‌ (40) రాణించడంతో 15 ఓవర్లలోనే వంద పరుగులు పూర్తిచేసిన ఆస్ర్టేలియా దీటైనా జవాబు ఇచ్చేలా దూసుకుపోయింది. లిచ్‌ ఫీల్డ్‌ స్థానంలో దిగిన పెర్నీ (47; రిటైర్డ్‌ హర్ట్‌) క్రీజులో ఉన్నంతసేపు భారత్‌ మ్యాచ్‌పై పట్టు సాధించలేకపోయింది. అలిస్సా హిలి 84 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ పూర్తిచేసి పటిష్ట స్థితికి చేర్చింది. తర్వాత వచ్చిన ఆసీస్‌ బ్యాటర్లను భారత్‌ బౌలర్లు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. సెకెండ్‌ స్పెల్‌లో అమన్‌జోత్‌ కౌర్‌ అద్భుత బౌలింగ్‌తో ఆస్ర్టేలియా బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రిటైర్డ్‌ హర్ట్‌ అయిన పెర్రీ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి స్నేహ రానా బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌ మీదుగా సిక్సర్‌ బాదడంతో ఆస్ర్టేలియా 49 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Updated Date - Oct 13 , 2025 | 12:52 AM