Share News

ప్రశంసే ఆమెకు పెద్ద బహుమతి

ABN , Publish Date - Sep 21 , 2025 | 01:21 AM

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు అలుపెరుగకుండా శ్రమించేది ఇంటి ఇల్లాలు.

ప్రశంసే ఆమెకు పెద్ద బహుమతి

  • బంధాన్ని బలపరిచే అద్భుత టానిక్‌

  • ఆమె శ్రమను గుర్తించండి

  • భార్య యోగ క్షేమాలు తెలుసుకోవడం భర్త కనీస బాధ్యత

  • అన్ని విషయాల్లో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలి

  • నేడు భార్యను ప్రశంసించే రోజు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు అలుపెరుగకుండా శ్రమించేది ఇంటి ఇల్లాలు. ఓ కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉందంటే అది ఆమె ఘనతే. తన గురించి ఆలోచించుకోకుండా కుటుంబ సభ్యుల కోసం కష్టపడే గొప్ప మనసు ఆమెది. ఓ తియ్యని, ఆప్యాయమైన ప్రశంస ఆమె పడిన కష్టాన్నంతా మరిచిపోయేలా చేస్తుంది. సంసార జీవితంలో భార్యను ప్రశంసించే భర్త వుంటే ఆ బంధం కలకాలం దృఢంగా నిలుస్తుంది. సెప్టెంబరు మూడో ఆదివారం భార్యను ప్రశంసించే రోజు సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంటి చాకిరీ మొత్తం చేసే భార్యను రెండు పదాలతో సంతృప్తి పరచగలమంటే నమ్మగలరా?, ఆ రెండు పదాలతో ఆమె పడ్డ కష్టం అంతా ఆవిరైపోతుందంటే...విశ్వసించగలరా? నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. సగటు భార్యను సంతోషపెట్టాలంటే ప్రేమతో కూడిన ప్రశంస చాలు. ఇల్లు ఊడ్చడం మొదలు..వంట, గిన్నెలు తోముకోవడం, దుస్తులు ఉతకడం.. ఒక్కటేంటి...అన్ని పనులు ఉరుకులు పరుగుల మీద ఆమె చేసుకోవాల్సిందే. పిల్లలు ఉంటే మరింత పని ఒత్తిడి. కానీ అంతటి శ్రమను ఒక్క ప్రశంసతో మటుమాయం చేసుకునేతత్వాన్ని భగవంతుడు ఆమెకే ఇచ్చాడు. కానీ ఏడాదంతా భార్య శ్రమను చూసీ చూడనట్టు వదిలేస్తున్న భర్తలే సమాజంలో అధికంగా ఉన్నారు. అందుకే కనీసం ఏడాదిలో ఒక్కసారైనా వాళ్లను ప్రశంసించేలా ‘వైఫ్‌ అప్రిషియేషన్‌ డే’ను ఏటా సెప్టెంబర్‌ మూడో ఆదివారం నిర్వహిస్తున్నారు. దీని వెనుక కచ్చితమైన చరిత్ర లేకపోయినా..ఇటీవల కాలంలో ఈ రోజుకు ప్రాధాన్యం పెరుగుతోంది.

పైకి చెప్పరు...

మహిళలతో పోలిస్తే..పురుషుల్లో భావవ్యక్తీకరణ చాలా తక్కువ. భార్యపై ఎంత ప్రేమ ఉన్నా..బయటకు చెప్పే నేర్పు చాలామంది పురుషుల్లో లోపిస్తోంది. ఆమె పడ్డ శ్రమను లోలోనే అభినందిస్తారు తప్ప..ఆమెతో నేరుగా చెప్పరు. అదే భార్యలో అసంతృప్తికి కారణమవుతోంది. ‘కోడి కూసిన దగ్గర నుంచి గొడ్డులా కష్టపడినా...ఈ కొంపలో గుర్తింపు ఉండదు’ అనే బాధ చాలా మందిలో కనిపిస్తుంది. మనకోసం అనుక్షణం కష్టపడే ఆమెను ప్రశంసించడం నేరం కాదన్న విషయాన్ని గుర్తించాలి. ఆమె శ్రమను గుర్తించాలి. ఆమె చేసే మంచి పనిని గుర్తించి ప్రశంసించాలి. మనసులో గంపెడు ప్రేమ ఉన్నా..వ్యక్తీకరించకుంటే నిష్ఫలమే. అందుకే ఆమెపై ఉన్న ప్రేమాభిమానాలను ఎప్పటికప్పుడు వ్యక్తీకరించాలి.

భార్యకు ప్రాధాన్యం ఇవ్వండి

భార్యకు అన్ని విషయాల్లో ప్రాముఖ్యం ఇస్తే ఆమె సంబరపడుతుంది. కుటుంబ విషయాలన్నీ ఆమెతో పంచుకుని ఆమె సలహాలు తీసుకోవడం వల్ల మరింత సంతోషంగా ఉంటుంది. అలాగే ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక్క రోజైనా.. కుటుంబంతో కలిసి గడిపేందుకు ప్రయత్నించండి. రోజులో ఎంత బిజీగా ఉన్నా..కొంత సమయాన్ని ఆమెతో మాట్లాడేందుకు కేటాయించండి. అలాగే ఆమెతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోండి. ప్రత్యేక దినాల్లో ఆమెను డిన్నర్‌కు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి.

పనిలో సాయపడాలి

ఆమెకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే..మీరు ఓ చేయి వేయండి. పనిలో ఆమెకు సహకరించండి. ఆమెకు మీరు చేసే చిన్నపని వల్ల శారీరకంగా శ్రమ తగ్గకపోయినా.. మానసికంగా కలిగే ఆనందం వెల కట్టలేం.

గౌరవించండి

ఆమెకు గౌరవాన్ని ఇవ్వండి. ఆమె మాటకు విలువ ఇవ్వండి. పది మందిలో ఆమెను చులకన చేయకండి. వీలైతే పది మందిలో ఆమె గొప్పతనాన్ని షేర్‌ చేసుకోండి. విమర్శలు అందరి మధ్యా చేయకండి. ఏదైనా లోపం ఉంటే ఆమెకు ఒంటరిగా చెప్పండి. అదే ఆమెకు ఇచ్చే గౌరవం అని గుర్తుంచుకోండి.

ఇంట్లో ఉన్నా ఎక్కువ కష్టపడేది భార్య

ఉద్యోగం చేసే పురుషులు రోజుకు 8 నుంచి 10 గంటలు కష్టపడతారు. ఇంట్లో ఉన్న భార్య కనీసం 15 గంటలు కష్టపడుతుంది. ఆ స్థాయిలో పనిచేస్తేగానీ అన్ని పనులు చక్కబెట్టే వీలుండదు. ఉదయం ఇల్లు తుడవడం మొదలు, పిల్లల్ని స్కూళ్లకు సిద్ధం చేయడం, వంట, వార్పు, భర్త ఆఫీసు సమయానికి తగిన ఏర్పాట్లు...ఇలా లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులే. మళ్లీ సాయంత్రం అదే తంతు. పిల్లల చదువు, హోంవర్క్‌. వంట పూర్తిచేసి రాత్రి పడుకునేసరికి రాత్రి 11 గంటలు దాటుతుంది. ఇక, ఉద్యోగం చేసేవారైతే చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు ఇంటి నిర్వహణతో రెండు పడవలపై ప్రయాణించక తప్పని పరిస్థితి. అంతగా కష్టపడే ఆమె తన శ్రమకు తగిన ప్రతిఫలంగా ప్రశంస కోరుకునేందుకు నూటికి నూరు శాతం అర్హురాలు.

Updated Date - Sep 21 , 2025 | 01:22 AM